Minister Davos Tour: దావోస్ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి లక్షా ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం ఉన్న అంశాలనే దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రొజెక్ట్ చేశామన్నారు. ఏపీ వైద్య రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి అవకాశాలు వివరించామన్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, తీర ప్రాంత ప్రయోజనాలు ప్రపంచ స్థాయి వేదికపై వివరించామన్నారు. 50 ప్రపంచ స్థాయి కంపెనీల ప్రతినిధులు, కొత్త పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని తెలిపారు.
విశాఖ ఐటీ యునికార్న్ చేయాలన్న ప్రయత్నం దావోస్ సదస్సులో జరిగిందని.., గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఏపీ ముఖద్వారం కాబోతుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. విశాఖలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఆదిత్య మిట్టల్ కంపెనీ విస్తరించనుందన్నారు. పంపు స్టోరేజ్, విండ్, సోలార్ ద్వారా 30 వేల కోట్ల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి జరగనుందని అన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ విశాఖలో కార్యాలయం పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశాఖలో ఉపాధి అవకాశాలు రానున్నాయని.., దావోస్ సదస్సు ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించటం జరిగిందన్నారు.
దావోస్ వెళ్లి చేసిందేమిటి ?: జగన్ దావోస్ పర్యటనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్ నేత పల్లె రఘనాథ రెడ్డి డిమాండ్ చేసారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చంద్రబాబును చూసి జగన్ కూడా దావోస్ వెళ్లారని విమర్శించారు. జగన్ దానోస్ వెళ్లింది ప్రభుత్వ టూరా ?.., లేక ఫ్యామిలీ టూరా ? అని ప్రశ్నించారు. జగన్ ఫ్యామిలీ టూర్‌కు 14.42 కోట్ల ఖర్చు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు జగన్ పెట్టిన ఖర్చులో పదో వంతు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. అధికారంలోకివస్తే.. 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని ప్రచారం చేసుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వస్తే.. జగన్ హయాంలో పరిశ్రమలు పరారీ అయ్యాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలనే మళ్లీ చేసుకున్న జగన్ దావోస్ వెళ్లి చేసిందేమిటని నిలదీశారు. పెట్టుబడులు తేవాలంటే చంద్రబాబుకే సాధ్యమని.. ఆ పేటెంట్ చంద్రబాబుకే ఉందని చెప్పారు.
ఇవీ చూడండి