ఉపాధి హామీ పథకం కింద 2018-19లో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంపై రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. బకాయిల చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కొత్త పనులకు బిల్లులు చెల్లించడమేంటని ప్రశ్నించింది. బకాయిల చెల్లింపు కోసం రూ.870 కోట్ల విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో జీవో జారీచేసినట్లు కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. ఇప్పటివరకు చెల్లించకపోవడమేంటని మండిపడింది. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాకపోయినా బకాయిలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. బకాయిల చెల్లింపులో జాప్యానికి కారణమైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణకు పంచాయతీరాజ్‌శాఖ, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు నివేదించారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం.. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. బకాయిల చెల్లింపులో విఫలమైతే 4న జరిగే విచారణకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణసామగ్రి నిమిత్తం చేసిన ఖర్చుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది.
కేంద్రం నిధులిచ్చినా..
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పి.వీరారెడ్డి, న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, ప్రణతి తదితరులు వాదనలు వినిపించారు. ‘రూ.5లక్షల లోపు విలువచేసే పనులకు బకాయిలు చెల్లించేందుకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీచేస్తూ ఉత్తర్వులిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టుకు నివేదించింది. అయినా ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. కేంద్రం నుంచి నిధులు రావాలని ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు చెప్పడమేంటి? ప్రభుత్వం మారాక నాటి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులను నిలిపేశారు. కొత్త పనులకు బిల్లులు చెల్లిస్తున్నారు గానీ, గతంలో చేసిన వాటికి ఇవ్వట్లేదు’ అన్నారు.
అలా ఎందుకు చేస్తున్నారు: ధర్మాసనం
ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పాత పనులకు బిల్లులు చెల్లించకుండా తాజా పనులకు చెల్లించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎవరికీ చెల్లించకుండా నిలిపేస్తామని హెచ్చరించింది. ఎప్పుడెన్ని నిధులు విడుదల చేశారో తాజా వివరాలు సమర్పించాలని సహాయ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) హరినాథ్‌కు స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: