Pending Bills: రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. ఆర్థిక సంవత్సరం గురువారంతో ముగిసింది. గుత్తేదారులు, సరఫరాదారులు, ఇతరత్రా బిల్లులు పెండింగులో ఉన్నవారు కొద్ది రోజులుగా ‘ఆర్థికశాఖలోని పెద్దల’ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరి నిమిషంలోనైనా బిల్లులు చేయించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజుల్లో ఒక్క బుధవారమే దాదాపు రూ.4వేల కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. చివరి రోజు ఎంతమేర బిల్లులు చెల్లించారో ఇంకా తేలలేదు. పీడీ ఖాతాలు, ఇతర హెడ్ ఆఫ్ అకౌంట్లకు సంబంధించి దాదాపు రూ.60వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నట్లు సీఎఫ్‌ఎంఎస్ సమాచారం. ఇందులో మార్చి నెలలో చెల్లించిన రూ.14వేల కోట్లు పోనూ మిగిలిన బిల్లులన్నీ పెండింగులో ఉండిపోయినట్లే.
సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో ఖజానాలో బిల్లులు చెల్లింపులను నిలిపివేస్తుంటారు. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 45 రోజుల ముందు నుంచే బిల్లులు స్వీకరించలేదు. ఆర్థికశాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చినా సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతిక సమస్యల పేరుతో బిల్లులు నిరాకరించడంతో ఆ రూపేణా పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో పడ్డాయి. అప్పుడప్పుడు కొందరికి పై స్థాయిలో ప్రయత్నాలతో కొన్ని బిల్లులకు అవకాశం లభించింది. అత్యధిక మంది బిల్లులు అప్‌లోడ్ చేయలేకపోయారు. అనేక ప్రభుత్వ విభాగాలు కొత్త బిల్లులు అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే చాలారోజుల పాటు ‘ఎర్రర్’ అనే కనిపించింది. ప్రస్తుత సంవత్సరం పెండింగు బిల్లులు తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయకపోవడం మరో సమస్యగా మారుతోంది.
గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా జీతాలు, పింఛన్లు, ఇతరత్రా ఖర్చులూ, బిల్లులూ అన్నీ కలిపి ఏటా దాదాపు రూ.1,80,000 కోట్ల మేర చెల్లిస్తున్నారు. అయినా పెద్ద ఎత్తున బిల్లులు పెండింగులో ఉండిపోతుండటంతో చిన్న గుత్తేదారుల నుంచి పెద్ద సరఫరాదారుల వరకు లబోదిబోమంటున్నారు. అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడి నుంచి ఉత్తర్వులు వెలువడుతున్నా సరైన చర్యలు ఉండటం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్లూ దాఖలవుతున్నాయి. ఆ సందర్భంలో సాక్షాత్తూ ఐఏఎస్ అధికారులు న్యాయస్థానం ముందు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదీ చదవండి: Minister Botsa: అప్పులు చేసి ఆ డబ్బులు మా ఇంట్లో పెట్టుకున్నామా?: మంత్రి బొత్స