ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు వైద్యులకు మధ్య సమన్వయం కోసం రాష్ట్ర ఐఎంఏ కోవిడ్ టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డా.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గత ఐదు నెలల నుంచి కోవిడ్‌ను అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతోపాటు ఐఎంఏ డాక్టర్లు కూడా ముందు వరుసలో ఉన్నారన్నారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో ఒక రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర కోఆర్డినేటర్, 13 జిల్లాల కోఆర్డినేటర్లను నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో ఐఎంఏ డాక్టర్లు లేవనెత్తిన సందేహాలను ఎప్పటికప్పుడు స్పెషల్ హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ భాస్కర్ పరిష్కరించే వారన్నారు.
కోవిడ్ డ్యూటీ చేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా సోకితే వారికి మంచి వైద్యం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు డా.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఐఎంఏలో 60 ఏళ్ల లోపు వయసున్న ప్రైవేట్ డాక్టర్లు సుమారు 5000 మంది ఉన్నారని, వారిలో 90% మంది ప్రస్తుతం కోవిడ్ డ్యూటీలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రతి ఆసుపత్రిలో, ప్రతి ల్యాబ్‌లలో ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డా.ప్రసాద్ రెడ్డి సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ఎవరూ అధైర్య పడవద్దన్నారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడిపై నేడు సమీక్ష.. అనంతరం బెంగళూరుకు సీఎం