కృష్ణా జిల్లాలో కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు.. సుజన ఫౌండేషన్ సహకారంతో వెన్యూ కన్వెన్షన్‌లో మరో వంద పడకల అదనపు కొవిడ్ ఆస్పత్రిని అధికారులు ఏర్పాటు చేశారు. విజయవాడ జీజీహెచ్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన నూతన కేంద్రంలో చికిత్సలను అందించనున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్తో సహా ఇక్కడ పలు వైద్య సౌకర్యాలు సమకూర్చారు.
ప్రతి 10 మందికి ఓ వైద్యుడు..
ప్రతి 10 మంది కొవిడ్ బాధితులకు ఓ వైద్యుడి చొప్పున మొత్తం పది మంది ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు.. ఇక్కడి వంద పడకలను పర్యవేక్షించనున్నట్లు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా కొవిడ్ నోడల్ అధికారి, సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్.. సుజన ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
వారి కృషి అభినందనీయం..
విజయవాడ జీజీహెచ్‌కు కరోనా రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒత్తిడి తగ్గించేందుకు.. సమీపంలోని వెన్యూ కన్వెన్షన్‌లో సుమారు 100 బెడ్ల ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన ఆక్సిజన్ సదుపాయాలతో జీజీహెచ్ విస్తరణ వైద్యశాలగా నేటి నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఇందుకు సహకరించిన సుజన ఫౌండేషన్‌కు పాలనాధికారి ధన్యవాదాలు తెలిపారు. కరోనా బాధితులతో పాటు డ్యూటీ డాక్టర్లు, వైద్య సిబ్బందికి.. తాగునీరు, భోజనం, వసతి సదుపాయాలు కల్పించడానికి ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి: