High Temperatures: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి మధ్యలోనే మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది నుంచే తీవ్రత కనిపిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈనెల 14 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఈనెల 14న 36.7 డిగ్రీల గరిష్ఠ, 20.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15న 37.4 డిగ్రీలు, 16న 38.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల17న 40.1 డిగ్రీలు, ఈనెల 18న 41.2, ఈనెల 19న 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
అల్లాడుతున్న జనం...
అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, పళ్లరసాలు, చెరుకురసం, నిమ్మరసం వంటి వాటితో ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎండలకు తాళలేక తప్పక బయటకు వస్తే గొడుగులు, చేతి రుమాలు, టోపీలు వంటివి వెంట తెచ్చుకుంటున్నారు. పలు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి మధ్యలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: