కొండగుట్ట(హిల్‌లాక్) భూముల్లో ‘నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. పశువుల మేత, అక్కడి దేవాలయాల్లో పూజల నిర్వహణ తదితర సామూహిక అవసరాల కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం సరికాదని స్పష్టంచేసింది. కొండగుట్ట భూములను ఇళ్ల స్థలాల కోసం గుర్తించొద్దని ప్రభుత్వం జీవో ఇస్తే.. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించారని ఆక్షేపించింది. ‘సహజవనరులకు ధర్మకర్తగా రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేటు వ్యక్తులకు వాటిపై యాజమాన్య హక్కు కల్పించడానికి వీల్లేదు. తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాకం గ్రామ పరిధి సర్వేనంబరు 612లోని యట్టేరి గుట్ట (సిద్దేశ్వర గుట్ట)కు చెందిన 131 ఎకరాలను ఇళ్ల స్థలాలకే కాకుండా మరే ఇతర పథకాల కోసం వినియోగించొద్దు’ అని తహశీల్దార్‌ను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు.
కుంట్రపాకం పరిధిలోని సర్వేనంబరు 612లోని 131 ఎకరాల భూమిలో విగ్రహాలు, దేవాలయాలను తొలగించి నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకం కింద ఇంటి స్థలాలు ఇవ్వడానికి చేస్తున్న యత్నాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్త ఎం.మహేశ్వరి, సామాజిక ఉద్యమకారిణి వై.విజయలక్ష్మి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి ‘గుట్ట పోరంబోకు’గా ఉందన్నారు. అక్కడి దేవాలయాల్లో ప్రజలు పూజలు చేస్తున్నట్లు తెలిపారు. సమీప గ్రామాలవారు మూగజీవాలను మేపుకుంటున్నారని వివరించారు.. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 10 ఎకరాల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దీని వల్ల పర్యావరణానికి, స్థానిక గ్రామస్థులకు ఎలాంటి హానీ ఉండదన్నారు. దీనిపై కోర్టు విస్పష్టమైన తీర్పు వెలువరిస్తూ ‘కొండగుట్టలు, ఇతర సహజ వనరులు ప్రకృతి ప్రసాదించిన అనుగ్రహాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
వాటిపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించకూడదు. ప్రస్తుత విషయంలో 10 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సహజ వనరులైన కొండగుట్ట భూముల్లో ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడమే. అధికరణ 48ఏ, 51ఏ(జి) ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం, వృద్ధిచేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి.. తహశీల్దార్ అక్కడి భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదించడం చట్ట విరుద్ధం. జీవవైవిధ్యం, పర్యావరణ ప్రభావం నేపథ్యంలో గుట్ట భూములను ఇళ్ల స్థలాలుగా మార్చడానికి వీల్లేదు’ అని హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: