ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు రుణం పొందే చట్టబద్ధ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. ఏపీఎస్డీసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలు 18న విచారణకు ఉన్నందున ప్రస్తుత వ్యాజ్యాన్ని వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఏపీఎస్డీసీకి రుణం పొందే చట్టబద్ధ హోదా కల్పిస్తున్న ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ చట్టం-2020 లోని సెక్షన్ 3(3), 4ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన కె.హిమబిందు హైకోర్టులో పిల్ వేశారు.
రూ.25 వేల కోట్లు రుణం పొందేందుకు ఏపీఎస్డీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాలు చట్ట విరుద్ధమని పిటీషనర్ న్యాయవాది నళినీ కుమార్ వాదనలు వినిపించారు. ఏపీఎస్డీసీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఆర్బీఐ చట్టం ప్రకారం 'సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొందలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏపీఎస్డీసీ వ్యవహారంలో ఇప్పటికే పిటీషన్లు దాఖలై ఉన్నాయి కదా.. మరో పిల్ ఎందుకని ప్రశ్నించింది. న్యాయవాది నళిన్ కుమార్ స్పందిస్తూ.. గత పిల్లోని అంశాలు ప్రస్తుత వ్యాజ్యంలోని విషయాలు వేరు వేరని అన్నారు.
అందుకు సంబంధించిన దస్త్రాలన్ని కోర్టు ముందు ఉంచామన్నారు. తాజాగా వేసిన వ్యాజ్యంపై ప్రాథమిక అభ్యంతరం ఉందని పిటీషనర్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. ఏపీఎస్డీసీ కార్యకలాపాలను ప్రారంభించిన ఏడాది తర్వాత ఇప్పుడు పిల్ వేయడం సరికాదన్నారు. ఇప్పటికే పిల్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఏపీఎస్డీసీపై వేసిన వ్యాజ్యాలతో ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం విచారణను 18కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు