High Court on Amara raja Group Lands: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 629/5 లో అమరరాజా బ్యాటరీస్‌కు అనుబంధ పరిశ్రమ మంగళ్ ఇండస్ట్రీకి చెందిన 17.69 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈనెల 2న జిల్లా కలెక్టర్ ప్రాసీడింగ్ ఇచ్చారు. దాన్ని సవాలు చేస్తూ మంగళ్ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.హరిబాబు.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరపగా.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి . ఆదినారాయణరావు, న్యాయవాది మేడమల్లి బాలాజీ వాదనలు వినిపించారు. పరిశ్రమ ఏర్పాటు కోసం 2015లో అప్పటి ప్రభుత్వం 21.69 ఎకరాలను కేటాయించిందన్నారు. పరిశ్రమకు చెందిన యాజమాన్యం అప్పటి మార్కెట్ విలువ ఎకరాకు రూ .22.50 లక్షలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించిందన్నారు. వందల కోట్లు ఖర్చుచేసి పరిశ్రమ ఏర్పాటు చేశామని.. ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారన్నారు . పరిశ్రమకు కేటాయించిన మొత్తం భూమిలో కేవలం నాలుగు ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నామని.. మిగిలిన 17.69 ఎకరాలను నిరుపయోగంగా ఉంచామనే ఆరోపణతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. దానికి పూర్తిస్థాయిలో వివరాలు సమర్పించామన్నారు.
వాస్తవానికి 67 శాతం భూమిని పరిశ్రమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నామని కోర్టుకు తెలిపారు. మిగిలిన 33 శాతం భూమిని గ్రీన్ బెల్ట్ కోసం విడిచిపెట్టామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గ్రీన్వెల్ట్ కోసం స్థలం విడిచిపెట్టడం తప్పనిసరి అన్నారు. పరిశ్రమ విస్తరణకు ఉన్న భూమి సరిపోవడం లేదని యాజమాన్యం భావిస్తున్న తరుణంలో.. భూమిని నిరుపయోగంగా ఉంచారని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిశ్రమ నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా.. భూమిని తాము నిరూపయోగంగా ఉంచేమనే నిర్ణయానికి వచ్చి సంజాయిషీ నోటీసు ఇచ్చారన్నారు. భూమి వినియోగింపై వివరణ ఇచ్చినా.. అధికారులు పట్టించుకోలేదన్నారు.
పరిశ్రమ యాజమాన్యం కేవలం 4 ఎకరాలను వినియోగిస్తోందని.. మిగిలిన 17.69 ఎకరాలు నిరుపయోగంగా ఉంచారని ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ నోటీసు జారీచేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలన్నారు. పంచనామా నిర్వహించి, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ వాదనలపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇరువైపు వాదనలు విన్ని న్యాయమూర్తి .. ఆ భూమి వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలని, తొందరపాటు చర్యలొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఆ వ్యాజ్యాలపై మే 4కు విచారణ వాయిదా: పర్యావరణ నిబంధనలను పాటించలేదన్న ఆరోపణతో అమర్‌రాజా పరిశ్రమ మూసివేతకు ఏపీపీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు మే 6 పొడిగించింది. వ్యాజ్యాలపై విచారణను మే 4కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిన్ ఏవీ శేషసాయి , జస్టిన్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడీలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ యూనిట్ల మూసివేతకు పీసీబీ 2021 ఏప్రిల్లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ అధీకృత అధికారి నాగుల గోపీనాథ్ రావు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. ఏపీపీసీబీ తరపు న్యాయవాది స్పందిస్తూ .. సమగ్రంగా కౌంటర్ తయారు చేశామని దానిని కోర్టులో వేసేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను మే4కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం