ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ.. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మేనిఫెస్టో విడుదల చేసినా బాధ్యులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు.. విచారణ ఈ నెల 31కి వాయిదా వేశారు.
ఈ సందర్భంగా ఎస్ఈసీ, భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. దీంతో పాటు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, తెదేపా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటరాజుకు పిటిషనర్ వ్యక్తిగతంగా నోటీసులు అందజేసే విధంగా ఆదేశాలిచ్చింది. మేనిఫెస్టో విడుదల చేసిన వారిపై ఎస్ఈసీని కలిసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ కె.శివరాజ శేఖర్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
చిలుకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు పచ్చజెండా..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని విజేతలకు ఇచ్చే ధ్రువపత్రాల్లో స్పష్టం చేయాలని రిటర్నింగ్ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
గణపవరం, పసుమర్రు తదితర గ్రామాలను చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనం చేస్తూ.. గతేడాది జనవరిలో ప్రభుత్వం జీవోలు జారీచేసింది. ఆ జీవోలపై దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ జరిపిన హైకోర్టు.. అక్టోబర్ లో స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ స్పష్టత కోసం ఈ వ్యాజ్యాలు మరోసారి న్యాయమూర్తి వద్దకు విచారణకు వచ్చాయి.
ఇదీ చదవండి: