విజయవాడ నగర శివారు రాజీవ్ నగర్ కట్ట ప్రాంతంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీపంలో బుడమేరు కాల్వ పొంగటంతో డ్రైనేజీల గుండా వెళ్ళాల్సిన వరద నీరు.... ఇళ్ళలోకి చేరటంతో... ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్లలోని స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వరద తగ్గితేనే తాము మోటార్లు పెట్టి నీటిని తోడతామని మునిసిపల్ అధికారులు చెప్పటంతో.. స్దానికులు భయాందోళనకు గురవుతున్నారు.
అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం, విద్యాధరపురం ప్రాంతాల్లోని కాలనీలు నీటమునిగాయి. ఈదురు గాలులకు విజయవాడ మత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలో భారీ వృక్షం నేలకొరిగింది. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిన వృక్షం.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడింది. తీగలు తెగి ప్రధాన రహదారిపై పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మున్సిపల్ అధికారులు వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం పెద్ద చెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగటంతో... పక్కనే ఉన్న ఇళ్లు, వ్యాపారం సముదాయాలు నీటమునిగాయి. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జి. కొండూరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వీటి కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పులి వాగు ఉప్పొంగి పారుతోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక