గుండె తడి ఆరని బాధలు ఒకటి కాదు.. రెండు కాదు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎటు చూసినా.. ఇలాంటి దృశ్యాలే కన్పిస్తున్నాయి. కరోనా రక్కసి కరాళ నృత్యానికి.. ఒక్కొక్కరు బలి అయిపోతుంటే.. వారిని కాపాడలేక కుటుంబసభ్యులు చేష్టలుడిగిపోతున్నారు. రక్షించండి అంటూ వారు చేస్తున్న ఆర్తనాదాలు.. అరణ్యరోదనలే అవుతున్నాయి.
కరోనాతో బాధపడుతున్న తల్లిని కాపాడుకునేందుకు.. ప్రైవేట్ఆస్పత్రుల చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో.. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది ఓ మహిళ. చికిత్సపొందుతూ చనిపోయిన తల్లి మరణవార్త విని.. ఆ యువతి గుండెలు పగిలేలా రోదించింది. అమ్మ కావాలి అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. అంతా మౌనంగా రోదించారు. మరో వ్యక్తి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక.. ఆసుపత్రి రోడ్డుపై కూలబడి ఏడవటం గుండెల్ని పిండేసింది.
ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం..
నగరానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తల్లిని ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనూ చేర్చుకోకపోవడంతో.. ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మంచాలు లేవని తన తల్లిని ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకడంతో.. వారిని ఒకే స్ట్రెచర్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్తున్న దారుణ దృశ్యాలు అందరినీ కలచివేశాయి. స్ట్రెచర్లు లేక రోగులు ఇబ్బందిపడుతుంటే.. సిబ్బంది మాత్రం వాటిపై ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లడం బాధితులను బాధించింది. కొంతమంది బాధితులు ఆస్పత్రిలో పడకల కోసం.. అంబులెన్సుల్లోనే ఆక్సిజన్ సిలిండర్లతో ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొంది. బాధితులు కన్నీళ్లుపెట్టినా.. గగ్గోలు పెట్టినా.. ఆర్తనాదాలు చేసినా.. వారికి దొరికే సమాధానం ఒక్కటే.. ''పడకల్లేవు.. కాసేపు ఆగండి'' ఈ పరిస్థితులు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద సర్వసాధారణమయ్యాయి.
రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి అయిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి.. దూర ప్రాంతాల నుంచీ చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడ కేటాయించిన పడకలు సరిపోక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితుల సంఖ్యకు తగ్గట్లు పడకలు పెంచి.. ప్రాణాలు కాపాడమని బాధితులు, వారి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: