శాసనసభ్యురాలి పదవికి పాముల పుష్ప శ్రీవాణి అనర్హతను తేల్చే విషయంలో అధికరణ 192(2) ప్రకారం భారత ఎన్నికల సంఘం నుంచి అభిప్రాయం తీసుకోవడంలో గవర్నర్ ముఖ్యకార్యదర్శి విఫలమయ్యారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని...,ఆమె ఎస్టీ అంటూ తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కాదని..పిటిషనర్ తరపు న్యాయవాది భూషన్ రావు వాదనలు వినిపించారు. తహసీల్దార్ స్థాయి అధికారి ఇచ్చిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం చెల్లదన్నారు. ఆర్డీవో, సబ్ కలెక్టర్, ఆపైస్థాయి అధికారులు ఇచ్చిన ఎస్టీ ద్రువీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.
ఎమ్మెల్యేను అనర్హురాలిగా తేల్చే విషయంలో రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించాలని కోరుతూ...అఖిల భారత దళిత్ రైట్స్ ఫోరం, ఏపీ యూనిట్ 2010 అక్టోబర్ 4 న గవర్నర్ వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు. అయినా ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. అనర్హతను తేల్చే విషయంలో అధికరణ 192(2) ప్రకారం భారత ఎన్నికల సంఘం నుంచి గవర్నర్ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. గవర్నర్‌కు సమర్పించిన పిటిషన్ విషయంలో తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.
వాదనలు విన్న న్యాయస్థానం..వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, బుట్టాయగూడెం తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
ఇదీచదవండి