విశాఖ మన్యంలో లాటరైట్ ముసుగులో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు తనతో పాటు పార్టీ నేతలు కిడారి శ్రావణ్, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరిలు లోకాయుక్తకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. వైకాపా నేతలు గిరిజనుల సంపదను కొల్లగొడుతూ..ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్తే..ఎస్టీ మహిళనైన తనను అకారణంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొవిడ్ నిబంధనలు, రక్షణ పేరుతో కుంటి సాకులు చూపి అరెస్టు చేశారని ఆక్షేపించారు.
గిరిజన ప్రాంతంలోకి గిరిజనులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న తీరును లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఈ అంశంపై న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు. ఖనిజ సంపద దోపిడీ కోసమే దట్టమైన అటవీ ప్రాంతంలో రహదారి నిర్మించారని ఆరోపించారు.
ఇదీ చదవండి
Amaravathi lands: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు