Employees Pen-down: ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి నిరసన చేపట్టారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణాజిల్లా నందిగామ, మచిలీపట్నంలో ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీ కార్యాలయం సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెన్‌డౌన్ తో పాలనా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు.. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని పీఆర్సి సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ప్రధాన రహదారి నుంచి వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.
గుంటూరులో..
గుంటూరు కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా అన్ని కార్యాలయాల్లో పెన్ డౌన్, యాప్ డౌన్ చేశారు. ఏపీఎన్జీవో, అమరావతి ఐకాస, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ ప్రతినిధులు కార్యాలయాలకు వెళ్లి సహాయ నిరాకరణ చేపట్టాలంటూ అభ్యర్థించారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రకాశంలో..
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకాశం జిల్లా చీరాలలో పురపాలక కమిషనర్‌కు మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు.
విశాఖలో..
పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు.. విశాఖ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులంతా నిరసన తెలిపారు. ట్రెజరీ శాఖ కార్యాలయంలో ఉద్యోగులంతా ఓ చోట చేరి చర్చలు జరుపుతున్నారు. విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్ డౌన్ చేసి నిరసన తెలుపుతున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో.. రెవెన్యూ, విద్యాశాఖ ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు.
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేసి నిరసన చేపట్టారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరై.. తరగతి గదుల్లోకి వెళ్లకుండా నిరసన తెలిపారు.
విజయనగరంలో..
విజయనగరం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు పెన్ డౌన్ నిర్వహించారు. కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్నిచోట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్‌డౌన్‌లో పాల్గొన్నారు. పాలకొండ సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. పాలకొండ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో.. ఉద్యోగులు సేవలను నిలిపివేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కర్నూలులో..
కర్నూలు కలెక్టరేట్, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. నందికొట్కూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న సచివాలయాన్ని ఉద్యోగుల సంఘల నాయకులు మూసివేశారు.
కడపలో..
కడప కలెక్టరేట్‌లో ఉద్యోగులు విధులకు హాజరైనా పనిచేయకుండా కూర్చున్నారు. కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త పీఆర్సి జీవోలను రద్దు చేసి పాత జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చిత్తూరులో..
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో.. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఉప ఖజానా, ఇరిగేషన్ కార్యాలయాల్లో ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే ఉద్యోగులు విధులకు హాజరైనప్పటికీ విధుల్లో నిమగ్నం కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉపసంహరించుకునే వరకు తమ పోరు కొనసాగుతుందని ఉద్యోగులు తెలిపారు. మరో పక్క ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురంలో..
అనంతపురం జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగాయి. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి సహాయ నిరాకరణ చేశారు.
ఇదీ చదవండి:
Protest for PRC: సమ్మెకు మద్దతుగా.. నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు