Probationary IAS Officers Meet Governor: సివిల్ సర్వీసు అధికారులపై భారతదేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని.. వాళ్లు నిర్లక్ష్యానికి గురికాకుండా చూడటమే అధికారుల ప్రథమ కర్తవ్యం అని గవర్నర్ పేర్కొన్నారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్ వేదికగా శిక్షణలో ఉన్న ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఏపీ కేడర్‌కు కేటాయించిన 2020 బ్యాచ్‌కు చెందిన పది మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు(IAS), రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) ప్రొబేషనరీ అధికారులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అధికారులకు గవర్నర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులపై ఉందన్నారు. వివక్షకు తావులేకుండా అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని, సమాజంలోని అణగారిన ప్రజలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడటమే అధికారుల ప్రథమ కర్తవ్యం అన్నారు.
ఈ సందర్భంగా.. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ పరిస్ధితులను గవర్నర్ హరిచందన్ గుర్తు చేసుకున్నారు. 'తుపాను వల్ల 14 జిల్లాలు పూర్తిగా ధ్వంసమై, 1.80 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో న్యాయ, రెవెన్యూ మంత్రిగా, సహాయ పునరావాస ఇన్‌ఛార్జ్‌గా నేనే ఉన్నా. నివాసగృహాలు పూర్తిగా నేల మట్టమైన బాధితుల సహాయార్థం.. నాటి ప్రధాని వాజ్‌పేయి ఇందిరా ఆవాస్ యోజన కింద ఏడు లక్షల ఇళ్లు మంజూరు చేశారు. తొలి జాబితాలో గుత్తేదార్లు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి పేర్లే ఉన్నాయి. దీంతో ఆ జాబితాను తిరిగి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించా. అధికారులు సాధ్యమైనంత వరకు అయా పరిస్థితులకు అనుగుణంగా, నిజాయితీతో కూడిన నిర్ణయాలను వెలువరించాలి. పేదలకు సహాయం చేయడంలో స్వతంత్రంగా ఆలోచనలు చేయాలి. అదే జీవితానికి తృప్తినిస్తుంది' అని గవర్నర్ హరిచందన్ అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ జె.శ్యామలరావు మాట్లాడారు. ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు.. తమకు కేటాయించిన జిల్లాల్లో వివిధస్థాయిల్లో ఒక సంవత్సరంపాటు శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం సచివాలయానికి అనుబంధం అయ్యారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సహాయ కార్యదర్శి సన్యాసిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: