శాసన సభలో ఏ అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శాసన సభ సమావేశాల నిర్వహణ సహా వరద నష్టంపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. సభను తప్పుదోవ పట్టించాలని తెదేపా ప్రయత్నిస్తే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదని.. మంచి పాలనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
నెలలోనే నష్ట పరిహారం:
పంట నష్టం జరిగిందని సమాచారం అందిన నెలలోనే పరిహారం అందిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుకు చిత్తు శుద్ది ఉంటే 16 నెలలుగా ప్రభుత్వ విధానాలపై చర్చకు రావాలన్నారు.
మీడియాకు అనుమతి:
కరోనా నిబంధనల వల్లే శాసన సభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ తీసేశామని చీఫ్ విప్ వెల్లడించారు. ఈ విషయంపై బీఎసీలో చర్చించే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సభా సమయంలో అన్ని ఛానళ్లకు లైవ్ ఇస్తున్నామని తెలిపారు. మీడియా ప్రతినిధులెవరినీ శాసన సభ వద్దకు రావద్దని చెప్పలేదన్నారు. కొవిడ్ పరీక్ష అనంతరం అనుమతి తీసుకుని ఎవరైనా రావచ్చని తెలిపారు. మీడియాను అనుమతించడం లేదని కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు.
నానిపై దాడి తెదేపా కార్యకర్త పనే:
మంత్రి పేర్నినానిపై దాడిని శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. దాడికి యత్నించిన నిందితుడు తెదేపా కార్యకర్త అని తేలిందన్నారు. పలువురు వైకాపా నేతలపై ప్రతిపక్ష నేతలు దాడులుచేస్తూ.. భయాందోళనలకు గురిచేశారన్నారు. తమ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: