బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా పదవీ విరమణ చేశాక కూడా.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చమని ఆయనకు నోటీసులిచ్చే దుస్థితి తెచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యక్తిగత పేరుతో అప్పులు తెచ్చి, ఆయన్ని కూడా ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. గవర్నర్ పేరుతో పరిపాలన నడుస్తున్నా.. ఆయన వ్యక్తిగత పేరుకు, అప్పులకు ఏం సంబంధం ఉందో బుగ్గన సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు. రాష్ట్ర దౌర్భాగ్య స్థితిపై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని గవర్నర్.. తనదాకా వచ్చాక అధికారుల్ని పిలిచి వివరణ అడుగటం తగదన్నారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో పడి చీకటిమయమైందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు.. కాంట్రాక్టర్లకు బకాయిలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చే జీతాలను కూడా.. సజ్జల ఏదో ధర్మం చేస్తున్నట్లుగా మాట్లాడటం తప్పన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కూడా సకాలంలో ఎందుకు జీతాలు చెల్లించలేకపోతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీ చూడండి: HIGH COURT: పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్టు చేయాల్సిందే