ఒక్కో పార్టీ కండువాకు రూ.20, ధరించే ఒక్కో మాస్కుకు రూ.20 చొప్పున ఖర్చు అభ్యర్థుల లెక్కల్లోకి ఎక్కుతుంది. వాహనాల రోజువారీ అద్దె, డ్రైవర్లు, క్లీనర్ల బత్తా, ఆహార పదార్థాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడపత్రాలు, ఆటోల వెనుక అంటించే స్టిక్కర్లు, ఇతరత్రా పరికరాలు.. ఇలా అన్నింటికీ ధరలను ప్రకటించింది. వాటి ఆధారంగా డివిజన్ల వారీ పోటీ చేసే అభ్యర్థుల ఎన్నిక వ్యయాన్ని లెక్కిస్తారు. 30 మంది వ్యయ పరిశీలకులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఒక అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్ఠంగా రూ.5లక్షలని వెల్లడించారు.
ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒక రోజుకు టాటా ఇండికాకు డ్రైవరు బత్తాతో కలిపి రూ.1,200, ఎనిమిది నుంచి 16 మంది కూర్చునే మ్యాక్సీ క్యాబ్‌లకు రూ.1,700, ఆటోకు రూ.350, మినీ లారీ రూ.1700, బస్సు రూ.3900, ట్రాక్టరుకు రూ.1,400 నిర్దేశించారు. సాధారణ కుర్చీకి రూ.7 ధర ఉంది. కార్యకర్తలకు, నేతలకు అందించే టీ, కాఫీలకు రూ.5 నుంచి రూ.10, నీటి ప్యాకెట్‌కు రూ.1, లీటరు నీటి సీసాకు రూ.20 ధర ఉంది. 400 వాట్స్ లౌడ్ స్పీకర్లు రెండింటికి రూ.3850, ఐదుగురు కూర్చునే వేదిక(12అడుగుల పొడవు, అంతే వెడల్పు) నిర్మాణ వ్యయం రూ.2200గా నిర్దేశించారు. వస్త్రంతో తయారు చేసిన చిన్న జెండాలకు రూ.30, పెద్దవైతే రూ.61గా ఉంది.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న జీహెచ్‌ఎంసీ నామినేషన్లు పర్వం