Kollu Ravindra on YCP: సామాజిక విద్రోహానికి పాల్పడిన వైకాపా ప్రభుత్వం, సామాజిక న్యాయంపై మాట్లాడటం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. దళిత, బీసీ, మైనారిటీలను జగన్మోహన్ రెడ్డి అణచివేస్తున్నది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. కొద్దిమందికి మంత్రి పదవులిచ్చి, ఆయా వర్గాలకు చెందిన మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వ సామాజిక న్యాయమా అని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల అణచివేతపై వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదని విమర్శలు చేశారు. ఇది సామాజిక ద్రోహం కాదా అని నిలదీశారు. వైస్ ఛాన్సలర్ పదవుల్లో జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచెయ్యి చూపారన్నారు. పదవులు, అధికారం కోసం సొంత వర్గాలను పాలకులకు తాకట్టుపెడుతున్న మంత్రులంతా చరిత్రహీనులేనని కొల్లురవీంద్ర ధ్వజమెత్తారు.
దువ్వాడ శ్రీను తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు దుయ్యబట్టారు. ఒక రౌడీషీటర్ని మండలికి పంపిస్తే ఇలానే ఉంటుందని ఆయన అన్నారు. మహానాడు విజయవంతం కావటంతో వైకాపా నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. దువ్వాడ శ్రీను తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంతెన సత్యనారాయణరాజు హెచ్చరించారు.
ఇవీ చదవండి :