దేశ రక్షణలో అసువులు బాసిన సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం మన కర్తవ్యమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తమ అత్యున్నత సేవల ద్వారా భారతీయ సాయుధ దళాలు దేశ పౌరుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు.
విజయవాడ రాజ్ భవన్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్ ప్రత్యేకంగా సన్మానించారు. దేశ సార్వభౌమత్వాన్ని అస్ధిరపరిచే బాహ్య శక్తులను నిలువరిస్తూ తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయిధ దళాలను అభినందించేందుకు పతాక దినోత్సవం మంచి సందర్భమన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో రాష్ట్రం నుంచి మాతృభూమి రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను సన్మానించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు గవర్నర్ వ్యాఖ్యానించారు.
దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య రోహిణికి గవర్నర్ నగదు పురస్కారాన్ని అందించారు. పతాక దినోత్సవ నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏటా సహకారం అందించడానికి అంగీకరించడం అభినందనీయమని కొనియాడారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన అధికారులను గవర్నర్ అభినందించారు. కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. రాచయ్య, పశ్చిమగోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాద రావు, జిల్లా సంయుక్త పాలనాధికారి తేజ్ భరత్, తూర్పుగోదావరి జిల్లా సైనిక సంక్షేమ విభాగం నుంచి మల్లికార్జునరావులను అభినందించారు.
ఇవీ చదవండి..