Fake Oil Tankers Registration : ట్యాంకర్లు లేకుండానే మోటారు వాహన ఇన్స్పెక్టర్ పేరిట రీ-రిజిస్ట్రేషన్ చేశాడు రవాణా శాఖలోని ఓ సీనియర్ అసిస్టెంట్. కృష్ణా జిల్లా డీటీసీ.. సీనియర్ అసిస్టెంట్ విఠల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విఠల్ తోపాటు, నకిలీ పత్రాలు సృష్టించిన విజయవాడకు చెందిన మరో ముగ్గురిపై సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇదీ జరిగింది...
విజయవాడ డీటీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు విఠల్. నిత్యం వాహనాల రిజిస్ట్రేషన్ పద్ధతులు చూస్తూ.. చేస్తూ.. ఉండటంతో అదే పనిలో నకిలీ రీ రిజిస్ట్రేషన్ చేయడంతో తన తెలివితేటలు చూపాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి 11 ట్యాంకర్లను రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చూపించాడు విఠల్. వాటికి విజయవాడలోని డీటీసీ పరిధిలో రీ-రిజిస్ట్రేషన్ చేసి , ఆర్సీ పత్రాలు తయారు చేశారు. అసలు ట్యాంకర్లు లేకుండానే ఇదంతా సీనియర్ అసిస్టెంట్ విఠల్ అంతా తానై నడిపారు. ఎంవీఐ పేరిట ఆన్లైన్లో లాగిన్ వివరాలు సిద్ధం చేసుకొని, అన్నింటికీ తానే ఆమోదం తెలిపాడు. ఇది బయటకు రావడంతో అతడిని రవాణాశాఖ ఉన్న తాధికారులు విచారించారు. 11 ట్యాంకర్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసింది నిజమేనని అంగీకరించాడు. విఠల్ ఇచ్చిన వివరాల ఆధారంగా అధికారులు విచారించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ ట్యాంకర్లను అసలు తాము తయారు చేయలేదని అశోక్ ల్యాండ్ , టాటా మోటార్స్ తెలియజేశాయి. ఇఫ్కో - టోకియో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ పేరిట ఆ ట్యాంకర్లకు పుట్టించిన బీమా పత్రాలు తాము జారీ చేయలేదని ఆ బీమా సంస్థ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మనరాష్ట్రానికి తెచ్చి రీ- రిజిస్ట్రే షన్ చేసిన వాహనాల సామర్థ్య పరీక్షలు గన్నవరం వద్ద నిర్వహిస్తుంటారు. అక్కడ ఈ 11 ట్యాంకర్లను సామర్థ్య పరీక్షలకు తీసుకు రాలేదని తేల్చారు. కాలుష్య నియంత్రణ ధ్రువ పత్రాలు ( పీయూసీ ) తదితరాలన్నీ నకిలీవని గుర్తించారు. ఆ ట్యాంకర్లు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మన రాష్ట్రానికి వచ్చాయా లేదా అనేది నిర్ధరణకు రాష్ట్ర పరిధిలోని పలు ఎన్ హెచ్ఎఐ టోల్ ప్లాజాల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నమోదైన వాహనాల వివరాలను పరిశీలించారు. వాటిలో కూడా ఎక్కడా ఈ ట్యాంకర్లు ఆయా టోల్ ప్లాజాల మీదగా రాలేదని తేల్చారు. దీంతో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారని అధికారులు తేల్చారు.
ఈ ఘటనలో విఠల్ తో పాటు బాధ్యులైన విజయవాడకు చెందిన సయ్యద్ గౌస్ మోహిద్దీన్ , ముసినిపల్లి సత్య నారాయణ , కోటా శివరామ్ ప్రసాద్లపై డీటీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు ఆ నలుగురిపై మోసం , ఫోర్జరీ , నకిలీ పత్రాలను అసలువిగా ఉపయోగించడం తది తర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో సీనియర్ అసిస్టెంట్ విఠల్ పై అదనంగా ప్రభుత్వ ఉద్యోగి ( సెక్షన్ -409 ) కూడా జతచేశారు.
ఇదీ చదవండి : TDP Protest on Heavy Prices : పెరిగిన ధరలపై..తెదేపా పోరుబాట...