గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏ అభ్యర్థి తరఫున కూడా వారు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులిచ్చారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ ఆదేశాల్ని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు వెంటనే తెలియజేయాలని.. అవి తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని కోరారు. వైకాపా కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని, ఆ పార్టీ నాయకులు, మంత్రులే స్వయంగా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఫలితంగా ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు. క్షేత్రస్థాయిలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు. అలా చేస్తే అది నిబంధనలకు విరుద్ధమవుతుంది.
వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటూ ఫిర్యాదులు...: 'వైకాపా కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు అనుకూలంగా పనిచేస్తున్నారు. బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికలతో పాటు అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరంతా బహిరంగంగానే వైకాపా అభ్యర్థుల తరఫున కార్యకర్తల్లా పనిచేశారు' అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలంటూ వైకాపా నాయకులు, మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యానాల క్లిప్పింగ్‌లు, వీడియోలు కూడా ఎన్నికల సంఘానికి చేరాయి. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలివే..: 'వైకాపాలో పనిచేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాం. ఆ పనులు పూర్తయ్యాయి. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలకు వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్ కల్పించాలని ఒక మిత్రుడు సూచించారు. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేం. మీరే అర్థం చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎలా అవకాశం కల్పించాలనేది పార్టీయే చూసుకుంటుంది.' - వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ముందు 2019 ఆగస్టు 12న విశాఖలో నిర్వహించిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
వైకాపా కుటుంబాలకే వాలంటీర్ పోస్టులిచ్చాం: 'పార్టీ అంటేనే కార్యకర్తలు...అలాంటి వారికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది? వాలంటీర్ పోస్టులు ఇచ్చింది వైకాపా కుటుంబాలకు చెందిన వారికే కదా! కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదన్నది విష ప్రచారమే' - 2022 జూన్ 27న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో హోంమంత్రి తానేటి వనిత
ఇవీ చూడండి