ఎపీపీఏస్సీ విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తప్పులు చేసి కోర్టు చుట్టు నిరుద్యోగ యువతను తిప్పుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు అన్నారు. దీనికి ముగింపు పలకాలని.. లేనిపక్షంలో ఎపీపీఏస్సీని ముట్టడిస్తామని సూర్యారావు హెచ్చరించారు.
అడుగడుగునా అవరోధాలు: 2018లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంది. ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో 56తప్పులు ఇచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్తే కొన్ని ప్రశ్నలు తీసేసి నార్మలైజ్ చేసి మరలా ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ విషయంలో డిజిటల్ మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేసింది. అందులో 326మంది క్వాలిఫై అని ప్రకటించింది. నోటిఫికేషన్లో పేర్కొనకుండానే డిజిటల్ మూల్యాంకన చేయడం తప్పని అభ్యర్దులు కోర్టుకు వెళ్తే మాన్యువల్ మూల్యాంకన చేయిస్తామని చెప్పి తాజాగా ఫలితాలు విడుదల చేసింది.
అయితే.. డిజిటల్ మూల్యాంకనలో క్వాలిఫై అయిన 202మంది మాన్యువల్ మూల్యాంకనలో ఎంపికయ్యారు. సాధారణంగా 5-10% తేడా వస్తే సర్దుకోవచ్చు. కానీ 65%పైగా ఫలితాలలో తేడాలు రావడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశా, నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలకు కూడా వెంటనే పిలవడంతో దానిపై మరింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వాల్యుయేషన్ చేసిన వారి పేర్లు కోర్టు అడిగితే షీల్డ్ కవర్లో ఇచ్చిన ఎపీపీఏస్సీ, మాన్యువల్ చేసిన వారి పేర్లు కొన్నివాట్సప్లల్లో తిరగడంతో దీనితో ఇంక అనుమానాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పోస్టులు ఇవ్వడం ఇష్టం లేక కావాలనే తప్పులు చేసి కోర్టు చుట్టు నిరుద్యోగ యువతను తిప్పుతున్నారు. దీనికి ముగింపు పలికేందుకు తక్షణం సమగ్ర విచారణ జరపాలని.. లేనిపక్షంలో ఎపీపీఏస్సీని ముట్టడిస్తామని డీవైఎఫ్ఐ హెచ్చరించింది.
ఇదీ చదవండి: