విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. ఆలయ మహా మండపంలో పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఈవో భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. మొత్తం 60 అంశాలపై చర్చ జరగనుంది. దసరా ఉత్సవాలకు ముందు జరుగుతున్న ఈ పాలకమండలి సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ అంశాలపై కూలంకుషంగా చర్చించనున్నారు.
కొవిడ్ నిబంధనలతో వేడుకలు..
కరోనా ఆంక్షలు అమలవుతున్న తరుణంలో ఉత్సవాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజుకు ఎంత మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించాలి? సాధారణ దర్శనం, టిక్కెట్ దర్శనాలపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గత ఏడాది దసరా సమయంలోనూ కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తుల సంఖ్యను పరిమితం చేశారు. ఈసారి అదే పద్ధతి కొనసాగించాలి? కరోనా మూడో వేవ్ ప్రచార నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపైనా సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.
టెండర్ల విషయాలపై చర్చ..
పారిశుధ్య టెండర్ల వ్యవహారంలో గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించటం.. కోర్టు ఇచ్చిన ఆదేశాలు, రద్దు చేసిన ఈ టెండర్లను తిరిగి ఎలా నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు సెక్యూరిటీ, అమ్మవారి భక్తులకు సమర్పించిన చీరల వేలానికి చెందిన టెండర్లు, సెల్‌ఫోన్లు, ప్రసాదాల తయారీ సరకుల టెండర్ల విషయాలపైనా.. అధికారులు ప్రవేశపెట్టిన తీర్మానాలు చర్చకు రానున్నాయి.
శాశ్వత నిర్మాణాలపై దృష్టి..
70 కోట్ల రూపాయలతో కొండ పరిరక్షణకు చేపట్టిన చర్యలు, శాశ్వాత ప్రాతిపదికన ప్రసాదాల పోటు, అన్నదాన భవనం, కేశఖండనశాల నిర్మాణాలపైనా సభ్యులు తమ అభిప్రాయాలు వినిపించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం సమావేశంలో చర్చించి తీర్మానించిన అంశాల వివరాలను పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు మీడియాకు వివరించనున్నారు.
ఇదీ చదవండీ.. ప్రేమోన్మాదులు ‘బతుకు’నీయడం లేదు