సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల డొంక కదులుతోంది. వారం రోజుల క్రితం కడప జిల్లాలో మోసం వెలుగు చూసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు, నిరుడు ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు చలానాల ద్వారా జరిగిన ఫీజుల చెల్లింపులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా, విజయనగరంతోపాటు ఇతర జిల్లాల్లోనూ నకిలీ చలానాల వ్యవహారం బహిర్గతమైంది. వీటి ఆధారంగా మరో అయిదుగురు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కడప జిల్లాలో ఐదుగురిపై వేటు వేశారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
కృష్ణా జిల్లాలోని మండవల్లి, విజయవాడలోని గుణదల, పటమట, గాంధీనగర్, ఇతర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలన కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం... మండవల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నాలుగు నెలల్లో రూ.1.30 కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. విజయవాడ ఈస్ట్ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో రూ.12 లక్షలు, విజయవాడ వెస్ట్ డీఆర్ పరిధిలో రూ.54 లక్షలు, మచిలీపట్నం డీఆర్ పరిధిలో రూ.77 లక్షల వరకు చలానాల ద్వారా కుంభకోణం గుర్తించారు. విజయనగరం జిల్లాలోనూ రూ.10 లక్షల వరకు నకిలీ చలానాల రూపంలో జరిగిన అక్రమాలను గుర్తించినట్లు తెలిసింది. నిర్ధారణ జరగాల్సి ఉంది.
పదోన్నతులకు అనుమతి!
చాలాకాలంగా పెండింగులో ఉన్న గ్రేడ్-1, గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు జాబితా సిద్ధమైంది. కౌన్సెలింగ్ ద్వారా సుమారు 139 పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేసేందుకు వీలుగా జిల్లా అధికారులకు జాబితాలు పంపుతున్నట్లు ఐజీ శేషగిరిబాబు తెలిపారు.
తక్కువ చెల్లించి.. ఎక్కువ చూపించి
మొదట కడప నగరంలో నకిలీ చలానాల దందా వెలుగులోనికి వచ్చింది. అక్కడి అర్బన్, గ్రామీణ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఒకే రైటర్ ద్వారా సుమారు 290 చలానాల్లో మార్ఫింగ్ జరిగింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1.08 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. రైటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి బ్యాంకుల్లో తక్కువ మొత్తం ఫీజు చెల్లించి... దానిని మార్ఫింగ్ ద్వారా ఎక్కువ మొత్తం కట్టినట్లు నకిలీ చలానాలు సృష్టించాడు. ఈ సంఘటనలకు సంబంధించి ముగ్గురు రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను అధికారులు సస్పెండు చేశారు. మరో ఇద్దరు డాక్యుమెంటు రైటర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు మాట్లాడుతూ... ‘నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు విచారణలో తేలితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఫీజు చలానాలు నేరుగా సీఎఫ్‌ఎంఎస్ (సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ)కి అనుసంధానం చేశాం. వినియోగదారులు ఎంత ఫీజు చెల్లించారో సబ్‌రిజిస్ట్రార్లకు కంప్యూటరులో తెలిసేలా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేశాô’ అని వివరించారు.
ఇదీ చదవండి: cm jagan: చేనేతల కష్టాలు మరచిపోను