వెలుగు కాంతుల దీపావళిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసులు, దీపాల వెలుగులతో వీధులు, కాలనీలు కోలాహలంగా మారాయి. ఇళ్లన్నీ విద్యుద్దీపాల కాంతులు, మట్టి ప్రమిదల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.
గుంటూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న దీపావళి సంబరాలపై టపాసులు కాలుస్తూ అపార్ట్ మెంట్ వాసులు సంబరాలు చేసుకున్నారు.
విజయవాడ వ్యాప్తంగా దీపావళి పండగ శోభ సంతరించుకుంది. వన్‌టౌన్ ప్రాంతంలో జైనులు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జైనులకు ఆర్ధిక సంవత్సరం దీపావళితో ప్రారంభమవుతుంది. టపాసులు కాలిస్తే జీవ హింస చేసినట్లేనని..అందుకే బాణాసంచా కాల్చమని చెబుతున్నారు.
దీపావళి సందర్భంగా... విశాఖ పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీప ప్రజ్వలన చేశారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని దుర్గమ్మ దేవస్థానంలో దీపావళి సందర్భంగా...ధనలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు నాణెంతోపాటు, రక్షాబంధన్, అమ్మవారి ఫొటోను పంపిణీ చేశారు.
కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయం అంతా దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
ఇదీ చదవండి