రాష్ట్రంలో అత్యధిక వాహనాలు వినియోగిస్తోన్న రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ. 12 వేలకుపైగా బస్సులు తిప్పుతోన్న ఆర్టీసీ...రోజూ కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. రోజుకు 30వేలకు పైగా రూట్లలో సగటున 40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరుగుతుంటాయి. దూరప్రాంత బస్సులు ఎక్కువ దూరం నడుస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టడం సహా...నగరాల్లో సీఎన్జీ బస్సులను నడుపుతోంది. విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర పట్టణాల్లో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసి బస్సులను తిప్పుతోంది. ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మరింత దృష్టి పెట్టింది. టాటా మోటార్స్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఒక ఇంటర్మీడియరీ బల్క్ కంటైనర్ ఐబీసీని ఏర్పాటు చేసింది. విజయవాడ-1 డిపోలో ఏర్పాటు చేసిన కంటైనర్‌ను ఆర్టీసీ, టాటా మోటార్స్ సంస్థల ఉన్నతాధికారులు ప్రారంభించారు.
వాహనాల్లో డీజీల్తోపాటు ఫ్లూయిడ్...
ఆర్టీసీలో ప్రస్తుతం తిరుగుతోన్న చాలా బస్సులు టాటా మోటార్స్ తయారు చేసినవే. కేంద్ర ఆదేశాల మేరకు ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్-6 మోడల్ అధునాతన వాహనాలను కొనుగోలు చేస్తోంది. కాలుష్య నివారణ కోసం డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ రీఫిల్ మోడల్‌ను విజయవాడ-1 డిపోలో టాటా మోటార్స్ ఏర్పాటు చేసింది. 2 వేల లీటర్ల ఇందనం పట్టే సామర్థ్యం కలిగిన డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ రీఫిల్ ట్యాంకు, మీటరింగ్ యూనిట్, పంపు సెట్ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలకు తిరిగే ఆర్టీసీ బస్సుల్లో డీజిల్‌తోపాటు ఈ ఫ్లూయిడ్‌ను నింపుతారు. దీనివల్ల బస్సుల నుంచి కాలుష్యం వెలువడే స్థాయి పూర్తిగా నివారణ అవుతుందని అధికారులు తెలిపారు.
మెుట్టమెుదటి రాష్ట్రం ఏపీనే...
టాటా మోటార్స్ రీఫిల్లింగ్ మోడల్‌ను భారతదేశంలో ఉపయోగిస్తున్న మొట్టమొదటి రాష్ట్ర రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ కావడం విశేషం. రాష్ట్రంలోని ఆర్‌టీసీ డిపోల్లో 19 చోట్ల ఈ తరహా ఇంటర్మీడియరీ బల్క్ కంటైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా మోటార్స్ వారి విడిభాగాల పంపిణీదారులైన సాహ్ని ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ రీఫిల్ ట్యాంకులను సరఫరా చేస్తారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెంచుతామని తెలిపారు. వీటి ఫలితాలు, ప్రయోజనాలను పూర్తిగా విశ్లేషించి రానున్న రోజుల్లో రాష్ట్రంలో అవసరమైన అన్ని బస్ డిపోల్లో ఈ తరహా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.
ఇదీచదవండి