ఆ వాహనాలను ఆపం...
నిత్యావసర సరకులను తరలించే వాహనాలను ఆపబోమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. త్వరలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఇతరచోట్లకు తిరగడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న డీజీపీ... విదేశాల నుంచి వచ్చినవాళ్లు హోం క్వారంటైన్ తీసుకోవాలని సూచించారు.
ఆ విషయాలు దాయడం తప్పు...
విదేశాల నుంచి వచ్చినవాళ్లు గుంటూరు, అమరావతిలో ఉన్నారని తెలిసిందని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. వాళ్లు వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లి రావడం తప్పుకాదు.. ఆ విషయాలు దాయడం తప్పు అని డీజీపీ హితవు పలికారు. నిబంధనలు పాటించని 4 వేల మందిపై కేసులు పెట్టామని డీజీపీ వెల్లడించారు.
పరిస్థితిని అర్థం చేసుకోవాలి...
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద లాక్‌డౌన్ పరిస్థితిని డీజీపీ సవాంగ్ పరిశీలించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. ఇదంతా ప్రజల రక్షణ కోసమేనని గ్రహించాలని చెప్పారు. ఇదంతా మీ కుటుంబసభ్యులు, బంధువుల కోసమేనని తెలుసుకోవాలన్న డీజీపీ సవాంగ్... ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తేనే కరోనాను అరికట్టగలమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే అనుమతించండి: సీఎం