పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అహంభావ వైఖరి వల్ల దేశంలో ఎన్నడూ లేనివిధంగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇటువంటి పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్ చట్టవిరుద్ధంగా మాట్లాడించారని ఉమా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాద వైఖరితో వ్యవహరించిందని ఆయన ఆక్షేపించారు. తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళితే.. కలెక్టర్ ఆదేశాలు లేవని తిరస్కరించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.
సుప్రీం తీర్పు జగన్ అంహకారానికి చెంపదెబ్బలాంటిది
సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, ఇగోకు చెంపదెబ్బలాంటిదని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థలో తలదూర్చటమే అవివేక చర్య అని విమర్శించారు. రాజ్యాంగంపై గౌరవం లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగ సంఘ నాయకులు సిగ్గుపడాలని హితవు పలికారు.
సుప్రీం తీర్పు రాజ్యంగ పరిరక్షణకు దోహదపడుతోంది
సుప్రీం తీర్పు రాజ్యాంగ పరిరక్షణకు దోహదం చేస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోకూడదని టీఎన్ శేషన్ హయాంలోనే.. ఐదుగులు జడ్జీల ధర్మాసనం తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలిసినా.. ప్రభుత్వానికి సలహాదారులు, న్యాయనిపుణులు ఉండి కూడా సంక్షోభం తలెత్తే పరిస్థితి తీసుకురావటం దురదృష్టకరమన్నారు.
రాజారెడ్డి రాజ్యాంగం ఓడింది
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజారెడ్డి రాజ్యాంగం ఓడిందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. కోర్టు తీర్పుతోనైనా..ముఖ్యమంత్రి, సీఎస్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సీఎస్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికైనా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని హితవు పలికారు.
'లా' ఇలా ఉందంటే మా'లా'గే వెళ్తామనటం శోచనీయం
ఒక పక్క 'లా' ఇలా ఉంది అని ప్రభుత్వానికి మేం చెబుతుంటే..మేము మా'లా'గే వెళ్తామని ప్రభుత్వం మెుండిపట్టుదలకు పోవటం శోచనీయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం చారిత్రాత్మక తీర్పు వెల్లడించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా..వితండవాదం మాని ఎన్నికలకు సహకరించాలన్నారు.
బెంచ్ మారినా పంచ్ మారలేదు
"బెంచ్ మారినా పంచ్ మారలేదు. డేట్ మారినా ఫేట్ మారలేదు. అన్నయ్య ఇంట్లో పగిలిన మరో టీవి. ఏ1 రెడ్డి ఓదార్పు యాత్రకు బయల్దేరిన ఏ2 రెడ్డి." అంటూ తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా జగన్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఏమాత్రం మానాభిమానాలున్నా రాజీనామా చేయాలి
ఏమాత్రం మానాభిమానాలున్నా.. సుప్రీం చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడి ముఖ్యమంత్రి,మంత్రులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెదేపా అధికార ప్రతినిధి గన్నికృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బంది సాయం కోరి..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉద్యోగసంఘాలు ఇకైనా ఇంగితం తెచ్చుకోవాలి హితవు పలికారు.