తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై రాష్ట్ర విభజన చట్టం ఏం చెబుతోందన్న విషయాన్ని ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం జగన్ రాసిన లేఖల్లో ఎందుకు ప్రస్తావించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని జగన్ తాను రాసిన లేఖల్లో ఎందుకు కోరలేదని నిలదీశారు. 'కేసీఆర్ కొట్టినట్లుంటే తాను ఏడ్చినట్లుండాలనే' ధోరణిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్నారు.
ఏ రాష్ట్రమైనా విభజన చట్టం నిర్ణయాలు అమలు పరచకుంటే అందుకు బాధ్యత వహించి కేంద్రం విధించే ఆర్థికపరమైన ఇతర శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని 11వ షెడ్యూల్లో స్పష్టం చేశారన్నారు. నీటి కొరత ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ తలెత్తితే తొలి ప్రాధాన్యం తాగునీరు, వ్యవసాయానికి తర్వాతి ప్రాధాన్యం విద్యుతుత్పత్తికి అని విభజన చట్టం స్పష్టం చేస్తోందని వెల్లడించారు.
జగన్ లాలూచీ, ఎన్నికల పొత్తు, ఆర్థిక ప్రయోజనాల వల్ల మూడో ప్రాధాన్యంగా ఉన్న విద్యుతుత్పత్తి ఇప్పుడు తొలి ప్రాధాన్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాకు వ్యవసాయ అవసరాలు, రాయలసీమకు తాగునీటి అవసరాలు మరుగునపడిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ నుంచి వేల కోట్లు తెచ్చుకున్నందుకు సీఎం జగన్ రైతు ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. చేయాల్సిన పని చేయకుండా, కేంద్రానికి చెప్పకుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఏం లాభమని ప్రశ్నించారు. నారుమళ్లకు నీరు లేక రైతులు ఎదురుచూస్తుంటే.. 6.5 టీఎంసీల కృష్ణా నికర జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం పాలు చేయటం జగన్ చేతకాని తనమేనని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: