విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 17 నుంచి 25వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో... దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శార్వరీ నామ సంవత్సరం దసరా ఉత్సవాలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వెల్లంపల్లి శనివారం తొలి సమావేశం నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో పారదర్శకంగా దసరా ఉత్సవ ఏర్పాట్లపై దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మంత్రి ఆదేశాలు
- సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణకు అన్నిశాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- భక్తులు భౌతిక దూరం పాటించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
- రోజుకు పది వేల మందినే అనుమతించండి
- ఉచిత దర్శనం, 100 రూపాయలు, 300 రూపాయల కేటగిరీల్లో ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించాలి
- ఆన్‌లైన్ టిక్కెట్ పొందిన భక్తులనే అమ్మవారి దర్శనానికి అనుమతించండి
భవానీ దీక్ష గురువులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి... వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి క్యూ లైన్లలో థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తామని... కరోనా అనునిత లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కరోనా పరీక్షలు చేయించిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.