వైఎస్సార్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా నిర్ణీత గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. పథకాల అమలు తీరు తెన్నులపై సమీక్షించిన ఆయన..ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని పవర్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉషారాణి వివరించారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు భూ రీసర్వే పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. మూడు విడతల్లో భూ రీసర్వే చేపడుతున్నామన్న ఆమె..మొదటి విడతగా 5,363, రెండో విడతగా 5,911, మూడో విడతగా 6,187 గ్రామాల్లో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత రీ సర్వే ప్రారంభమైందని.., రాబోయే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రెండో విడతను జులైలో ప్రారంభించి..2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. మూడో విడత మార్చి 2022లో ప్రారంభించి.. అదే సంవత్సరం అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే సమగ్రంగా నిర్వర్తించడానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, సర్వే, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం చేసినట్లు వివరించారు. రీ సర్వే కోసం డ్రోన్లు, కార్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు.
రీ సర్వే ద్వారా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. పేరుకుపోతున్న భూవివాదాలను పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు.
ఇదీచదవండి