CPM Raghavulu: రాష్ట్రంలోని తెదేపా, వైకాపా, జనసేన పార్టీలు లౌకిక పార్టీలా? లేదా మతతత్వ పార్టీలా? అనేది తేల్చుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు భాజపాకు వంత పాడుతున్నాయన్నారు. విజయవాడలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచిందని, చెత్త పన్ను, ఆస్తి పన్నుపెంపుతో ప్రజలపై భారం మోపిందని రాఘవులు మండిపడ్డారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో కేంద్రం రెండు ముక్కలుగా చేసి పరిహారాన్ని పావు వంతు మాత్రమే ఇస్తామని చెప్తున్నా వైకాపా ప్రభుత్వం మిన్నకుండిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి, కేంద్రం చెప్పినవన్నీ వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణ వంటివి కేంద్రం చెప్పినట్టు రాష్ట్రం చేస్తుందని మండిపడ్డారు. రేషన్ బదులు నగదు పంపిణీ అంగీకార పత్రాలపై ప్రజలు సంతకాలు చేయొద్దన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం పార్టీ పోరాడాలని సమావేశాల్లో తీర్మానం చేశామన్నారు.
ఇదీ చదవండి: Conflict: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. మళ్లీ జాతర వాయిదా..!