కరోనాకు ముందు ఇంటి నుంచి కాలు బయట పెడితే.. వచ్చేది రాత్రికే. ఇప్పుడో... కాలు బయటపెట్టడమేందుకని భయం. ఒకవేళ తెగించి పెట్టినా.. ఎక్కడికిరా? అని ఇంట్లో నుంచి ఓ పెద్ద అరుపు. కరోనాతో ఎన్నో మార్పులు. పల్లె, పట్టణమని ఏ తేడా లేదు. ఆన్లైన్లో పిల్లలకు పాఠాల నుంచి.. హోమ్ నుంచే వర్క్ చేసే వరకూ.. మనిషి జీవితాన్ని మర్చేసింది కరోనా.
- అంతా స్మార్ట్‌గానే..
ఒకప్పుడు మీటింగ్ అంటే.. ఆ హడావుడే వేరు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు... వందల మందితో జరిగే.. సమావేశాలు.. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటింగ్స్ అయిపోయాయి. అన్ని మీటింగ్‌లు ఆన్లైన్లోనే. అంతేందుకు రాజకీయ సభలూ స్మార్ట్‌గానే జరుగుతున్నాయి. ఓ ఐదు, పదేళ్ల తర్వాత అలా.. జరుగుతాయనుకుంటే.. కరోనా దెబ్బకు కాస్త ముందుగానే.. ముందుకు వెళ్లాం. పిల్లలకు జూమ్ యాప్‌లో క్లాస్లయ్యాయి.. పెద్దలకు వీడియో కాల్ మీటింగ్‌లు సర్వ సాధారణమైపోయాయి. ఇంట్లో ఉంటూనే.. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేస్తున్నాం.
- ఛీ ఆన్‌లైన్‌లోనా...!
కాళ్లేమైనా.. విరిగాయా? బయటకు వెళ్లి కొనుకోవచ్చుగా. షాప్‌కి వెళ్లి చూస్తేనే.. వస్తువు నచ్చేది. ఇవీ మెున్నటి వరకూ.. మన ఫ్రెండ్‌తో మనం చెప్పిన సొల్లు కబుర్లే.. మరి ఇప్పుడేమైంది. అంతా.. ఆర్డర్ మాయ. పొట్టకు ఆకలేస్తే.. ఆన్లైనే.. ఒంటికేమైన వస్తువు కావాలంటే.. ఆర్డర్ ఇవ్వడమే. కరోనాతో ఇది ఇంకా పెరిగింది. సరదాగా సాయంకాలం నడవలేని మనం.. చిన్న వస్తువు కోసం.. ఆన్‌లైన్‌కు రెగ్యూలర్ టూరిస్ట్‌లుగా మారిపోయాం.
పక్క వాళ్లకు తాకొద్దు.. ఇతరులు తాకిన వస్తువును ముట్టుకోవద్దు.. ఇది కరోనా థియరీ. ఒక్క నొక్కు నొక్కితే చాలు.. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. చిన్న పెద్దా.. తేడా లేదు ఇప్పుడంతా .. డిజిటల్ చెల్లింపులకే అలవాటవుతున్నారు. పర్సులు, జేబులో కరెన్సీనోట్లు పెట్టుకు తిరిగేవారు.. వ్యాలెట్ పేమెంట్లు, ఆన్‌లైన్ చెల్లింపులు ఒంట పట్టించుకుంటున్నారు.
- అప్పుడు ఇవ్వని మనం.. ఇప్పుడు ఇచ్చేస్తున్నాం
పిల్లాడు ఏడ్చినా.. వాడికి అస్సలు ఫోన్ ఇవ్వం.. ఈ వయసులో ఫోన్ ఏంటి? ఏబీసీడీలు నేర్చుకునే వయసులో వాడికెందుకు ఫోన్? తల్లిదండ్రులు చెప్పిన ఈ మాటలు... ఇప్పుడు తికమక అయిపోయాయి. ఫోన్ ఇవ్వకుంటే.. ఇళ్లు పీకి పందిరేసినా.. పర్లేదు అనుకునే మనం. ఇప్పుడు మాత్రం.. తీసుకో బుజ్జి బంగారం అంటూ.. పిలిచి ఫోన్ ఇస్తున్నాం. బయటకువెళ్తే.. లేని పోని సమస్య.. కరోనా భయపెట్టి చంపుతోంది.. ఏం చేస్తాం మరి!
- టీవీలకు ఫెవి స్టిక్‌లా అతుక్కుపోయాం
కాసేపు టీవీ చూసినా.. బోర్ కొట్టేది. ఆరుబయట కుర్చోవడమో.. స్నేహితులతో కలిసి బాతకాని కొట్టడమో.. చేసే మనం.. ఇప్పుడు టీవీలో వచ్చే.. నటుల కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నాం. ఎంత మారిపోయాం. టీవీ అంటే అస్సలు నచ్చక పోయినా.. టీవీ చూడటం ఓ ఉద్యమంలా చేసే.. గతి పట్టింది కరోనాతో. బయటకు వెళితే.. గండం రా రమ్మని పిలుస్తోంది. గ్రూప్ మీటింగ్‌లకు గుడ్ బై చెప్పేశాం.
- ఇల్లే ఆఫీస్
ఆఫీస్‌కు వెళ్లాలంటే.. పొద్దున్నే లేచీ.. స్నానం చేసి.. పరుగో పరుగు అనుకుంటూ.. వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంట్లోనే.. అంతా. ఒక ఫోన్, ల్యాప్ టాప్ ఉంటే చాలు... ఇళ్లే ఆఫీస్.. సాఫ్ట్‌వేర్‌లో అయితే ఏకంగా 90 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమే. ఈ విధానం కాస్త మంచికే.. ఆఫీస్ ఒత్తిళ్లు తెలియని ఇంట్లో వాళ్లు.. వీడేంటీ చిర్రుబుర్రులాడుతున్నాడు అనుకునేవారు... ఇప్పుడు మాత్రం చేసే పనేంటో.. ఎంత ఒత్తిడి ఉంటుందో ఇంట్లో వాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: హస్తకళాకారులకు కరోనా కష్టం