కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పు కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ.. ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు మండిపడ్డారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు.. కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాన్ని నీరుగార్చేందుకు.. మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా.. అక్టోబర్ 31వ తేదీని 'కిసాన్ అధికార్ దివస్'గా గుర్తించినట్లు నరసింహారావు తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు.. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ తరహా చట్టాలను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు.
ఇదీ చదవండి: 'ఏ అంటే అమరావతి.. పి అంటే పోలవరం.. ఏపీని కాపాడండి'