Protest at Schools: పాఠశాలల విలీనంపై తిరుపతి సంజయ్ గాంధీ కాలనీ నగరపాలక పాఠశాల విద్యార్ధులు ఆందోళన చేశారు. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిది వరకు పాఠశాల నిర్వహిస్తుండగా.. విలీనం కారణంగా 6 నుంచి 8 తరగతులు మూసేశారు. టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేరాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్ధులతో కలిసి పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొర్లగుంట పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండడం వల్ల ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో 3, 4, 5 తరగతులను జడ్పీ పాఠశాలలో విలీనం చేశారు. కాలనీకి దూరంగా ఉన్న జడ్పీ పాఠశాలలకు చిన్నపిల్లలను ఎలా పంపాలంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బుంగబావి ప్రాథమిక పాఠశాలను విలీనం చేయవద్దంటూ విద్యార్థులు తలిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ముందు మా బడి మాకు కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు.
పాఠశాలను విలీనం వద్దంటూ పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హైస్కూల్ దూరంగా ఉందని చిన్నపిల్లలు వెళ్లడం ప్రమాదకరమని.. ఇక్కడే పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు.. ఉపాధ్యాయులను అడ్డుకుని ధర్నా చేశారు. 6, 7, 8 తరగతులను 4 కిలోమీటర్ల దూరంలోని పల్లిపాలెం జడ్పీ పాఠశాలలో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. మాబడి మాకు కావాలంటూ.. విద్యార్థుల ప్లకార్డులతో నిరసన తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయడంపై మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. అగ్రహారం పాఠశాల నుంచి ఎంఈవో కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కోట ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయవద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విలీనాన్ని విరమించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: