తెలంగాణలోని అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా సెమిస్టర్ విధానం అమలవుతోంది. బీటెక్‌లోనూ 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం ఉంది. ఫీజుల విషయంలో మాత్రం వార్షిక విధానాన్నే కొనసాగిస్తున్నారు. అంటే తరగతులు మొదలుకాక ముందే ఏడాది ఫీజును కళాశాలలు వసూలు చేస్తున్నాయి.
ఉదాహరణకు బీటెక్‌కు కొన్ని కళాశాలల్లో ఏడాది రుసుం రూ.2 లక్షలుంది. అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలంటే తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. దాన్ని సెమిస్టర్ల వారీగా రూ.లక్ష చొప్పున తీసుకుంటే కొంత వెసులుబాటు దొరుకుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీన్ని శాశ్వత విధానంగా మార్చాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) వార్షిక విధానంలోనే రుసుములను ఖరారు చేస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని వార్షిక విధానానికి మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎప్పటి నుంచో సెమిస్టర్ల వారీగానే రుసుములు తీసుకుంటున్నారు’ అని జేఎన్‌టీయూహెచ్ ఆచార్యుడు ఒకరు చెప్పారు. అదే విధానాన్ని అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లోనూ అమలు చేయవచ్చని సూచించారు. దానివల్ల ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లోని దాదాపు 4లక్షల మందికి ఊరట కలుగుతుందని అంచనా.
ఏఐసీటీఈ ఆదేశాలు అమలయ్యేనా?
కరోనా కారణంగా ఎక్కువ కుటుంబాలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని, 3-4 వాయిదాల్లో తీసుకోవాలని ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కళాశాలలకు ఆదేశాలిచ్చింది. అధ్యాపకుల వేతనాలు, తొలగింపు తదితర ఆర్థికపరమైన అంశాలపై ఏఐసీటీఈ ఇచ్చే ఆదేశాలను కళాశాలల యాజమాన్యాలు అసలు పట్టించుకోవడమే లేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఏఐసీటీఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా, శాశ్వతంగా సెమిస్టర్ల వారీగా ఫీజులు తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: