‘ఆంధ్రప్రదేశ్‌లోని యువతులు, మహిళలు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నామని భావిస్తే వెంటనే దిశ యాప్ తెరిచి... అందులో ఉన్న ‘ఎస్‌వోఎస్’ మీట నొక్కాలి. తక్షణమే వారి ఫోన్ నంబరు, చిరునామా, వారు ఏ ప్రదేశంలో ఆపదలో చిక్కుకున్నారు? వారున్న పరిస్థితులకు సంబంధించిన పది సెకన్ల వీడియో, ఆడియో రికార్డు దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. దాని ఆధారంగా సమీపంలోని పోలీసుస్టేషన్ సిబ్బంది అప్రమత్తమై బాధితుల్ని రక్షిస్తారు’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఓపెన్ చేసేందుకు వీలు కాకుంటే... ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలంది. ఈ యాప్ డౌన్‌లోడ్, దాని వినియోగంపై చైతన్యం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా విజయవాడలోని గొల్లపూడిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని.. ప్రతి మహిళా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైనప్పుడు వినియోగించేలా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఇంటింటికీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని వివరించింది. యాప్‌లోని ప్రధానంశాల్ని వెల్లడించింది.
* ఆపదలో ఉన్నామన్న సమాచారాన్ని బాధితులు ఈ యాప్ ద్వారా పోలీసులతోపాటు వారి కుటుంబ సభ్యులకూ చేరవేయొచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన 5 ఫోన్ నంబర్లను యాప్‌లో నమోదు చేసుకోవాలి.
* ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గనిర్దేశం కోసం ‘ట్రాక్ మై ట్రావెల్’ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
* ఈ యాప్‌లోనే డయల్ 100,112 నంబర్లు ఉంటాయి.
* సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు, పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: AP BJP: రేపు భాజపా రాష్ట్ర కార్యవర్గం భేటీ