వచ్చే నెల మొదటి వారంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విస్తరిస్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ చేయూత, ఆసరా, బీమా, జగనన్న తోడు, జీవన క్రాంతి పథకాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు అమూల్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీని, పశువుల చికిత్సకు కొత్త టోల్ ఫ్రీ నంబరును ప్రతిపాదించగా ముఖ్యమంత్రి ఆమోదించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. 'జీవన క్రాంతి పథకం కింద లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న పశువులకు యూనిక్ ఐడీ నంబరుతో పాటు జియో ట్యాగింగ్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. దాణా సేకరణ నుంచి అమ్మకం దాకా అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) అందుబాటులోకి తేవాలి. ఆసుపత్రులకు నాడు-నేడు పథకాన్ని వర్తింప చేయాలి' అని ఆదేశించారు.
మార్చి నాటికి రుణ ప్రక్రియ పూర్తి
'వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలకు సంబంధించిన రుణాల మంజూరు ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడి పెడితే సంబంధిత కుటుంబ జీవనోపాధి మెరుగవుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది' అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 'చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్ దుకాణాలకు మరింత ప్రాముఖ్యత కల్పించాలి. ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్న సంస్థలతో మాట్లాడి లబ్ధిదారులకు వారిని అటాచ్ చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలి. అనర్హులను తొలగించాలి. లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సమగ్ర అధ్యయనం జరగాలి. దీని కోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి' అని సీఎం సూచించారు. 'వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. ప్రతి 15 రోజులకొకసారి అమలుపై సమీక్షించాలి' అని ఆయన ఆదేశించారు.
ఇదీచదవండి: