ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లకు అనుసంధానించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఇదో చక్కని పరిష్కారమని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పనితీరుపై సమీక్షించారు. ‘ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులొచ్చాయి. పనులు చేస్తున్న వారికి చెల్లింపులు ఆలస్యం కాకూడదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అవసరమైతే దిల్లీ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి’ అని సీఎం సూచించారు.
‘గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల పనులు ఈనెల 15-20 కల్లా ప్రారంభించాలి. పనులకు తక్షణమే పాలనాపరమైన అనుమతులిచ్చి టెండర్లకు వెళ్లాలి. రోడ్లు, భవనాలశాఖలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు శాఖల్లోనూ రహదారులకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు ప్రదర్శించాలి. జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. చెత్త తరలింపునకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఉండేలా లక్ష్యం పెట్టుకోవాలి. ఇళ్లు, వీధుల్లో చెత్త సేకరించే సిబ్బంది జీతాల చెల్లింపునకు ప్రాధాన్యమివ్వాలి’ అని సీఎం ఆదేశించారు.
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై పర్యవేక్షణ
‘గ్రామసచివాలయాల పరిధిలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులతోపాటు ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి. పాఠశాల విద్యాశాఖతోనూ సమన్వయం చేసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. ‘ఉభయగోదావరి జిల్లాల్లో లవణీయత, ఉద్దానంలో ఫ్లోరైడ్ ప్రభావం, వైఎస్‌ఆర్ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘వైఎస్‌ఆర్ జలకళలో భాగంగా బోరు డ్రిల్లింగ్ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలో జమచేసి వారి నుంచి రిగ్గు నిర్వాహకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల లంచాలు లేని వ్యవస్థను తీసుకురాగలుగుతాం’ అని సీఎం వివరించారు.
- నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన రూ.1,900 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. సీఎం సమీక్షలో పాల్గొన్న అనంతరం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 9వేల కి.మీ.గ్రామీణ రహదారుల మరమ్మతుకు రూ.1,073 కోట్ల విడుదలకు అవసరమైన పాలన అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన రూ.800 కోట్ల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో ఇళ్లనుంచి చెత్త పన్ను వసూలు ప్రతిపాదనేదీ లేదని వివరించారు.
"వైఎస్‌ఆర్ జలకళ అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు ఇస్తాం. వైఎస్‌ఆర్ జలకళ కింద ఇప్పటివరకు 13,245 బోర్లు వేశాం. ఒక్కో బోరుకు సుమారు రూ.4.5 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 5 ఎకరాల్లోపు ఉన్న రైతుకు పూర్తి ఉచితంగా బోరు. 5–10 ఎకరాల మధ్యలో ఉంటే డ్రిల్లింగ్ మాత్రమే ఉచితం." - జగన్, ముఖ్యమంత్రి
సీఎంతో శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి భేటీ: శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం సీఎం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రెండోసారి శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ పాలనలో రాష్ట్రం.. నరకాంధ్రప్రదేశ్‌గా మారింది: చంద్రబాబు