గ్రామాల్లో పారిశుద్ధం, తాగునీరు, వీధి దీపాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై సమీక్షించిన సీఎం.. గ్రామాల్లో వైఎస్సార్ జలకళ, వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్, రోడ్ల నిర్మాణంపై చర్చించారు. జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని, చెత్తని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో వేయాలని ఆదేశించారు. వైఎస్సార్ జలకళ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని..చిన్న, మధ్య తరహా రైతులకు లక్షా యాభై వేల పంపుసెట్లు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా.. ఆ బోర్ ఎప్పుడు వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలని, అదే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాలు పూర్తిస్థాయిలో శుభ్రంగా ఉంచాలన్నారు. దాని కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు.
ఇదీచదవండి: 'మీ బిడ్డలు పరీక్షలు రాస్తుంటే.. ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండేవారా?'