Deputy CM Pawan Kalyan on Sajjala Estate Scam : వైఎస్సార్ జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అటవీ, డీకేటీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. సజ్జల కుటుంబ ఎస్టేట్‌లోని భూముల్లో అటవీ భూములెన్నో నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారంపై సర్వే అధికారులు ఇవాళ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలిబిడికి గ్రామం వద్ద దాదాపు 200 ఎకరాల్లో సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో వందల ఎకరాలు పట్టా భూములు, డీకేటీ భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని అటవీ భూములు, డీకేటీ భూములను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి.
తెలియదు, గుర్తు లేదు - పోలీసులకు సజ్జల సమాధానం
సుగాలిబిడికిలోని సర్వేనంబర్ 1629లో 40 ఎకరాల వరకు అటవీ భూములు కొట్టేశారనే ఫిర్యాదులు వచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో కడప డీఎఫ్‌ఓగా పనిచేసిన అధికారిని అడ్డుపెట్టుకుని పట్టా భూముల్లోకి అటవీ భూములను కలిపేసుకుని లీగలైజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సజ్జల ఎస్టేట్ భూములకు కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవర్నీ అనుమతించడంలేదు. ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల చుక్కల భూమి ఉంది. ఇందులో సుగాలిబిడికి గ్రామానికి చెందిన రాజానాయక్ భార్య బుక్కే దేవి పేరిట ఎకరా 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట ఎకరా 30 సెంట్ల డీకేటీ పట్టాను 1993లో ప్రభుత్వం అందజేసింది.
నాటి నుంచి బాధితులు ఆ పొలంలో మామిడిచెట్లు, ఇతర వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటున్నారు. తన రెండున్నర ఎకరాలను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని, నోరెత్తితే చంపేస్తామని బెదిరించినట్లు రాజానాయక్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కూ మొరపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని చాలామంది డీకేటీ పట్టా భూములను సజ్జల ఎస్టేట్‌లో కలిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - దర్యాప్తునకు సహకరించాలని సజ్జలకు హైకోర్టు ఆదేశం
ఈ వ్యవహారంపై మూడు రోజుల నుంచి రెవిన్యూ, అటవీశాఖ అధికారులు పోలీసు బలగాలతో వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సజ్జల ఎస్టేట్‌లోకి రానివ్వవలేదు. గేట్లు వేసి అడ్డుకున్నారు. సజ్జల కుటుంబ చెరలో ఉన్న సామన్యుల భూములకు విముక్తి కల్పిస్తామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు.
ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఉపముఖ్యమంత్రి పవన్ కడప కలెక్టర్‌ను ఆదేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వన్య ప్రాణులకు ఏమైనా హాని కలిగిందా అనే వివరాలు సమర్పించాలన్నారు. అటవీ భూముల సంరక్షణకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఈ విషయంపై నివేదిక సమర్పించగానే పవన్ కల్యాణ్‌కు కలెక్టర్ వివరాలు అందిస్తారని తెలుస్తోంది.