ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్(cm jagan) అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహక నిధులను సీఎం విడుదల చేశారు.
తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామని.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అవి రోడ్డున పడే పరిస్థితి ఉందని.. ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని జగన్ చెప్పారు. 97,423 మంది పారిశ్రామికవేత్తలతో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడం వల్ల వారిలో నమ్మకం పెరుగుతుందని అన్నారు. మధ్యతరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అలా కాకుండా ఉండేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టేందుకు పథకాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో.. కష్టాల్లోనూ పేదలను ఆదుకోగలిగామన్నారు. పరిశ్రమలతో పాటు ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.
పరిశ్రమలతో 12 లక్షల మందికి ఉపాధి
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్ పరిశ్రమలతో.. 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలకు ఊతమిస్తూ రూ.1124 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ.684 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటివరకు రూ.2,086 కోట్లు ప్రోత్సాహకాలిచ్చామని వివరించారు.
ప్రోత్సాహకాలు పొందుతున్న పరిశ్రమల్లో 42 శాతం మహిళలవే ఉన్నాయని.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: CORONA CASES IN SCHOOLS: ముసునూరు జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం..