ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా రైతులు ఎంత నష్టపోయారో గుర్తించి... రబీ ముగిసేలోగానే నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో... 2021 ఖరీఫ్‌లో గులాబ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లోకి రూ.22 కోట్ల పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. '18 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 13.96 లక్షల మంది రైతులకు ఈ రెండున్నరేళ్లలో రూ.1,071 కోట్లను పెట్టుబడి రాయితీగా అందించాం. ఏ సీజన్‌లో పంట దెబ్బతింటే అదే పంటకాలంలో సొమ్ము జమ చేస్తున్నాం. పారదర్శకత కోసం గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ చేసి.. జాబితాలను ప్రదర్శిస్తున్నాం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం'అని పేర్కొన్నారు.
'వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.18,777 కోట్లను నేరుగా రైతుల చేతుల్లో పెట్టాం. సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమా కింద రూ.3,788 కోట్లు ఇచ్చాం. పగటిపూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18 వేల కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీగా రూ.1,520 కోట్లు ఇచ్చాం. పొలాలకు 9 గంటల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటుకు రూ.1,700 కోట్లు పైగా ఖర్చు చేశాం' అని సీఎం వివరించారు.
రూ.35 వేల కోట్లతో ధాన్యం సేకరణ
'ధాన్యం సేకరణకు రూ.35వేల కోట్లు, పత్తి కొనుగోలుకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.6,430 కోట్లను వెచ్చించాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం' అని తెలిపారు. 'రైతుకు సమీపంలో... అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలు ఉన్నాయి. 'ఆర్‌బీకే స్థాయి నుంచి వ్యవసాయ సలహామండళ్లను ప్రారంభించాం. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్‌బీకే, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ల వద్ద వీటి సమావేశాలు జరగాలి. ఈ సందర్భంగా ప్రస్తావించే రైతు సమస్యలను కలెక్టర్లు పరిష్కరించాలి. రాష్ట్రస్థాయిలో చేయాల్సిన వాటిని విభాగాధిపతులు, వ్యవసాయశాఖ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి' అని నిర్దేశించారు.
50 రోజుల్లోనే పరిహారం
'సెప్టెంబరులో గులాబ్ తుపాను వచ్చి పంటనష్టం జరిగితే... 50 రోజుల్లోపే పరిహారం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మంగళవారమే డబ్బు జమ అవుతుందని రైతులు కూడా ఊహించి ఉండరు' అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అండగా ఉంటామని రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా.. సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ పురోగతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ధాన్యం బస్తా రూ.1,450 చొప్పున కొంటున్నారు
ఈ సందర్భంగా పలువురు రైతులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు. తనకు రూ.14వేల పెట్టుబడి రాయితీ అందిందని తాడేపల్లిగూడెం మండలం మాధవరం రైతు ధన్‌రాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వం బస్తా రూ.1,450 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. కౌలు రైతునైన తనకు రూ.10,500 పెట్టుబడి రాయితీ అందిందని, డీసీసీ బ్యాంకులో అయిదుగురు సభ్యుల సంఘానికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రుణం ఇస్తామన్నారని అనకాపల్లికి చెందిన కౌలు రైతు మహాలక్ష్మీనాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: SZC meeting: భేటీలతో రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం: అమిత్ షా