పోలవరం ప్రాజెక్టును విభాగాల వారీగా విడగొట్టి చూడకుండా.. అన్నింటినీ కలిపి చూసి అందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను వెంటనే తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం ఇక్కడి లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వచ్చిన జగన్ మోదీని కలిసి, 9 అంశాలపై వినతిపత్రం సమర్పించారు. పోలవరం, రెవెన్యూలోటు భర్తీ, తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు, కోతపెట్టిన రుణపరిమితి పునరుద్ధరణ, రేషన్ బియ్యం కోటా పెంపు, కొత్త జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతుల పొడిగింపు, కడప ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజం, ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ కేటాయింపుల అంశాలు ఉన్నాయి. అత్యంత ప్రధానమైన ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాలు దీనిలో కనిపించలేదు. ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేసిన అంశాల్లో అత్యధికం పాతవే. ఇదివరకు ప్రధానిని కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పిన విషయాలనే పునరుద్ఘాటించారు. సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభమైన వీరి భేటీ గంటన్నర సాగింది. అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రుణాలు, ఇతర పెండింగ్ బకాయిల గురించి విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌నూ సీఎం కలిసి, పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. శుక్రవారం ఉదయం జగన్.. హోం మంత్రి అమిత్‌షాను కలవనున్నారు.
ప్రధానికి అందించిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ..
* జలవనరుల సాంకేతిక సలహా మండలి ఆమోదించినట్లుగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలి. తాగునీటి విభాగానికయ్యే ఖర్చును ఈ ప్రాజెక్టు వ్యయంలో అంతర్భాగంగా చూడాలి. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అనుసరించాలి.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని విభాగాల వారీగా విడివిడిగా చూడకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కటిగా పరిగణనలోకి తీసుకొని దానిపై చేసిన వ్యయాన్ని తిరిగి చెల్లించాలి. ఇప్పటి వరకు పెట్టిన ఆంక్షల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.905.51 కోట్లు రాలేదు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా తిరిగి చెల్లించేలా చూడాలి.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ముందస్తుగా నిధులివ్వాలి. 80% పనులు పూర్తయిన తర్వాత రెండో త్రైమాసికంలో మిగిలిన నిధులు అందించాలి.
* 2014-15కి సంబంధించి పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పింఛన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి రూ.32,625 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు విడుదల చేసేలా చూడాలి.
* తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు బకాయిల కింద రూ.6,627.86 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ, ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సత్వరం పరిష్కరించాలి.
* 2016-17 నుంచి 2018-19 వరకు అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణనలోకి తీసుకొని గత మూడేళ్లలో రాష్ట్ర రుణపరిమితిలో రూ.17,923 కోట్ల కోత విధించారు. కొవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా కోత విధించిన రుణపరిమితిని పునరుద్ధరించడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది రుణాలే కానీ గ్రాంట్లు కావు.
* జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలి. ఆహారభద్రత చట్టం కింద రాష్ట్రానికి తక్కువ బియ్యం ఇస్తున్నారు. దీన్ని వెంటనే పునస్సమీక్షించాలి. రాష్ట్రానికి ప్రస్తుతం ఇస్తున్నదానికంటే నెలకు 77 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద కూడా తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. దీనివల్ల దాదాపు 56 లక్షల కుటుంబాలకు లబ్ధి అందడం లేదు. వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దాలి.
* రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 వైద్య కళాశాలలు ఉన్నాయి. కేంద్రం కొత్తగా మరో మూడు కాలేజీలకు అనుమతిచ్చింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందున వాటి సంఖ్య 26కి చేరింది. వైద్యకళాశాలలు 14 జిల్లాల్లోనే ఉన్నందున మిగిలిన 12 జిల్లాలకూ కళాశాలలు మంజూరు చేయాలి.
* భోగాపురం విమానాశ్రయానికి గతంలో ఇచ్చిన అనుమతుల గడువు ముగిసింది. తాజాగా అనుమతులివ్వాలి.
* ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్ నడిచేందుకు వీలుగా నిరంతరాయంగా ఇనుప ఖనిజం సరఫరాకు ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్ చాలా అవసరం.
* ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్ మినరల్స్ ప్రతిపాదనలను అందించాం. 14 చోట్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఏపీఎండీసీకి కేటాయించాలి.
రాష్ట్రపతి ఎన్నికపై చర్చ!
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి భేటీలో రాష్ట్రపతి ఎన్నికపైనా చర్చించి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. జులైలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఈ నెల 2వ వారంలో దీనికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికలో మిత్రపక్షాల సహకారం కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 30న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా దిల్లీకి వచ్చి ప్రధాని, హోం మంత్రిని కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. ఎన్డీయే కూటమికి 5,39,827 ఉన్నాయి. మెజార్టీ మార్కు దాటాలంటే 5,49,452 ఓట్లు కావాలి. మిగిలిన ఓట్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం తన అనుకూల పార్టీల మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రితోనూ చర్చలు జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం భాజపా వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి