CLASSES MERGING EFFECT ON STUDENTS: ప్రస్తుతం కిలోమీటర్ దూరంలో ఉన్న 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే.. బడి 3 నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరం పెరగనుంది. కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువ దూరమే ఉండొచ్చు. ప్రాథమిక పాఠశాల నుంచి మ్యాపింగ్ చేస్తున్నారు. విద్యార్థి నివాసానికి ప్రాథమిక బడులు కిలోమీటర్, కిలోమీటరున్నర దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు తీసుకుంటే... దూరం నాలుగు నుంచి నాలుగున్నర కిలోమీటర్లు అవుతుంది.
పరిశీలనకు వివరాలు.. త్వరలో కేటాయింపులు..
పదేళ్ల లోపు పిల్లలు ఇంత దూరం రోజూ నడిచి వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు ప్రధానోపాధ్యాయులు మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టగా... దీన్ని పరిశీలించేందుకు మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. ప్రధానోపాధ్యాయులు రూపొందించిన నివేదికలను పరిశీలించి కమిషనరేట్‌కు ఆన్‌లైన్‌లో వివరాలు పంపిస్తోంది. నివేదిక హార్డ్ కాపీని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పిస్తున్నారు. ఉన్నత పాఠశాలలకు కలిపినవి ఎంత దూరంలో ఉన్నాయి? ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? బైపాస్ రోడ్, కాల్వలు, రైల్వే గేట్ లాంటివి దాటాల్సి వస్తుందా? ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఎన్ని తరగతి గదులు ఉన్నాయి? 3, 4, 5 తరగతుల వారు రావడంతో అదనంగా ఎన్ని గదులు అవసరం? వంటి వివరాలను సేకరించారు.
ఫౌండేషన్ బడుల్లోని 1, 2 తరగతుల్లో 30 మందికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించనున్నారు. ఈ సంఖ్య 44 వరకు ఉన్నా ఒక్కరినే ఇవ్వనున్నారు. 45 నుంచి 74 మధ్య ఉంటేనే రెండో టీచర్‌ను కేటాయిస్తారు. రాష్ట్రంలో 1 నుంచి 5 తరగతుల్లో.. 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నవి 13,536 కాగా.. 31 నుంచి 60 వరకు ఉన్నవి 11,070 బడులు ఉన్నాయి.
రవాణా లేని గ్రామాల వారి పరిస్థితి..?
వీటిల్లో నుంచి 3, 4, 5 తరగతులు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనమైతే 1, 2 తరగతుల్లో ఉండే విద్యార్థుల సంఖ్య 40 లోపే ఉంటుంది. దీంతో ఆయా పాఠశాలల్లో ఒక్క ఎస్జీటీని ఉంచి, మిగతావారిని ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. పాఠశాల దూరం పెరగడంతో విద్యార్థులు ఆటోలు, ఇతరిత్రా రవాణా సదుపాయాన్ని వినియోగించుకుంటే అదనంగా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయం లేని గ్రామాల్లో విద్యార్థులు రోజూ పుస్తకాల బ్యాగ్ బరువులను మోసుకుంటూ రాకపోకలు సాగించాల్సి వస్తుంది. కొన్ని గ్రామాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. కేవలం ప్రాథమిక బడులే ఉన్నాయి. ఇలాంటి చోట్ల విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. బడి దూరం పెరగడం బాలికల విద్యపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదనంగా రవాణా ఛార్జీలు చెల్లించాల్సి వస్తే అది పేదలకు భారంగా మారుతుంది.
ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన..
నూతన విద్యా విధానం కింద తీసుకుంటున్న చర్యల ప్రకారం రాష్ట్రంలో ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి చివరికి.. 10,826 పాఠశాలలే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలు 4,158, ఉన్నత పాఠశాలలు 6,668 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 33,813 ఉన్నాయి. ఏవో కొన్ని మినహా వీటి నుంచి 3, 4, 5 తరగతులు 10,826 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. 100 లోపు విద్యార్థులు ఉన్న వాటిలో ప్రాథమిక తరగతులను విలీనం చేయడం లేదు. భవిష్యత్తులో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి: CBN ON YSRCP ATTACKS IN KUPPAM: క్వారీ అక్రమాలు ప్రశ్నించినందుకే.. వైకాపా దాడులు: చంద్రబాబు