Clashes between YSRCP leaders: వైకాపాలో పలువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు తమ సత్తాను చాటే క్రమంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో.. అభివృద్ధి పనుల అమలులోనూ తీవ్రజాప్యం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య నెలకొన్న వివాదం కారణంగా నియోజకవర్గంలో రూ.70 కోట్ల విలువైన పని ఆగినట్లు ప్రచారంలో ఉంది. ‘ఇక నుంచి మచిలీపట్నంలోనే ఉంటా.. ఎంపీ అంటే ఏంటో చూపిస్తా..’ అంటూ బాలశౌరి బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారంటే ఆ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోంది.
పలు చోట్ల ఎంపీలు, మంత్రుల అంతర్గత పోరు..
- నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు.. మంత్రి విడదల రజిని నడుమ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రజినికి మంత్రివర్గంలో చోటుదక్కడంతో ఎంపీ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రజిని మంత్రి కాకముందు ఆమె వర్గీయులు ఎంపీని పలుమార్లు బహిరంగంగా అడ్డుకున్న సంఘటనలున్నాయి. నాడు పోలీసులు జోక్యం చేసుకొని సరిదిద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
- తమ వారిపై మంత్రి ఉషశ్రీ చరణ్ కేసులు పెట్టించారని అనంతపురం ఎంపీ రంగయ్య వర్గీయులు చెబుతున్నారు. ఎంపీ సామాజికవర్గానికి చెందిన వారిని కళ్యాణదుర్గంలో (మంత్రి నియోజకవర్గం) ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయన వర్గీయుడిగా పేరున్న మున్సిపల్ ఛైర్మన్‌ను చాలాకాలం ఆ స్థానంలో కూర్చోనివ్వకుండా ఉషశ్రీ అడ్డుకున్నట్లు ప్రచారంలో ఉంది. తర్వాత కడపకు చెందిన పార్టీ పెద్దల చొరవతో ఆయన ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
- అనకాపల్లిలో ఎంపీ సత్యవతి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మధ్య అంతరం కొనసాగుతోంది. ఎవరి కార్యక్రమాలు వారే చేసుకుంటున్నారు. ఇటీవల ఓ ఆలయ ప్రారంభోత్సవంలో ఇది బహిర్గతమైంది. అనంతరం సర్దుకొని తమ మధ్య విభేదాల్లేవని చెప్పినా... పరిస్థితిలో మార్పు లేదని చర్చ జరుగుతోంది.
- అమలాపురంలోనూ ఎంపీ చింతా అనురాధ, మంత్రి పినిపె విశ్వరూప్ నడుమ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందని పార్టీ వర్గాల్లో వినపడుతోంది.
- రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు బజారుకెక్కాయి. అధిష్ఠానం హెచ్చరికతో వారిద్దరూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినా వారి నడుమ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నారు. నిడదవోలు, గోపాలపురం ఎమ్మెల్యేలు కూడా ఎంపీని దూరం పెడుతూ వస్తున్నారు.
బాలినేని-మాగుంట-వైవీ..
- ఒంగోలులో మూడు వర్గాలున్నాయి. ఏడాది క్రితం కొవిడ్ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒక జర్మన్ హ్యాంగర్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే (అప్పట్లో మంత్రి) బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఎంపీ మాగుంట.. కలెక్టర్ వద్దకు స్వయంగా వెళ్లి ఆ షెడ్ ఏర్పాటు ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది.
- గిద్దలూరులో ఎంపీ కుమారుడు రాఘవరెడ్డి తిరగడాన్ని స్థానిక ఎమ్మెల్యే రాంబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే తితిదే కార్యక్రమాల రూపంలో ఆయన తరచూ ఒంగోలు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు.
- ఏలూరు ఎంపీ శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య పోరు సాగుతోంది. శ్రీధర్‌తో విభేదాలున్నాయని చెబుతున్నా... ఆయన సోదరిని సర్పంచిగా పోటీ చేయించి ఎమ్మెల్యే గెలిపించడం చర్చనీయాంశమైంది. అధికారులను కూడా వారు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విభజించారన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది.
ఇవీ చూడండి: