విజయవాడలో మూడు కమర్షియల్ పార్కులుండగా.. 90 కాలనీ పార్కులున్నాయి. వీటితో పాటు కాలువగట్లు, మినీ పార్కులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పార్కులన్నీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అత్యధిక పార్కుల్లో పచ్చదనం దెబ్బతినగా.. వాటిలోని పరికరాలు మూలన పడిఉన్నాయి. ఈ స్థితిలో వాటి అభివృద్ధికి ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అయినా పరిస్థితి మారడం లేదు.
నగరంలోని రాజీవ్ గాంధీ పార్కు అతిపెద్ద కమర్షియల్ పార్కుగా, నగరపాలక సంస్థకు ఐకాన్‌గా ఉండేది. కానీ నిర్వాహణ లోపం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో ఆహ్లాదకరమైన రాఘవయ్య, అంబేడ్కర్ పార్కులను 80లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినా... కొద్ది కాలంలోనే పాడైపోయాయి. పౌంటేన్లూ శిథిలమయ్యాయి. పాతబస్తీలోని కే.ఎల్.రావు పార్కులో ప్రధాన ఆకర్షణగా ఉన్న బోటు షికారు మూలనపడింది.
గతంలో కోటి రూపాయల అమృత్ నిధులతో ఈ పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం బందరు, ఏలూరు, రైవస్ కాలువగట్లను దాదాపు 18 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. నగరంలో పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని... పర్యవరణవేత్తలు అంటున్నారు.
నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దడం, పార్కులను అభివృద్ధి చేయడం వల్ల.. స్వచ్ఛసర్వేక్షణ్‌లో 100 మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్థితిలో మాత్రం మార్కులు పడడం సందేహంగా ఉంది.
ఇదీ చదవండి: