స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు... ధైర్యానికి, పట్టుదలకు, నిజాయితీకి మారుపేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం పంతులు.. నేటి యువతకు ఆదర్శనీయమని కొనియాడారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ సైనికుల తుపాకీకి గుండె చూపిన ధైర్యశాలి అని గుర్తు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకెళ్లిన ఆయన.. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారని పేర్కొన్నారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం వంటివి చేపట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుని పేరుతో ఏర్పాటైన… ప్రకాశం జిల్లా అభివృద్ధికి తెదేపా హయాంలో అన్ని విధాలా కృషి చేశామన్నారు.
ఇదీ చదవండి:
నేడు, రేపు తెదేపా మాక్ అసెంబ్లీ...స్పీకర్‌గా ఎమ్మెల్యే డీబీవీ స్వామి!